అక్టోబర్‌ నాటికి అందాల దుర్గం | South Indian First Cable Bridge At Hyderabad | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ నాటికి అందాల దుర్గం

Jun 16 2019 10:33 AM | Updated on Jun 16 2019 10:42 AM

South Indian First Cable Bridge At Hyderabad - Sakshi

దుర్గం చెరువుపై నిర్మాణంలో ఉన్న కేబుల్‌ బ్రిడ్జి 

సాక్షి, గచ్చిబౌలి: దక్షిణ భారతదేశంలో తొలి కేబుల్‌ బ్రిడ్జిగా.. మహానగరానికి ఐకానిక్‌గా దుర్గం చెరువుపై నిర్మిస్తున్న హ్యాంగింగ్‌ బ్రిడ్జి పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జి అక్టోబర్‌ నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే గనుక అందుబాటులోకి వస్తే నగర సిగలో మరో మణిహారముతుందనడంతో సందేహం లేదు. దీంతో దుర్గం చెరువు ప్రాంతం ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇక్కడ జరుగుతున్న పనులను శనివారం శనివారం మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ పరిశీలించారు.

ఈ బ్రిడ్జి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని వంతెనను విద్యుత్‌ వెలుగులతో అలంకరించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి రెండు మిలియన్ల పని గంటలు ఎలాంటి ప్రమాదం లేకుండా పూర్తి చేశారు. అత్యంత భద్రతా చర్యలతో పనులు కొనసాగిస్తున్నారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో 238 మీటర్ల పొడవుతో చేపట్టిన ఈ భారీ కాంక్రీట్‌ నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని ప్రాజెక్ట్‌ పనులు చేస్తున్న ఇంజినీర్లు చెబుతున్నారు. బ్రిడ్జికి మొత్తం 53 సిమెంట్‌ కాంక్రీట్‌ సెగ్మెంట్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటికే 13 సెగ్మెంట్లను అమర్చారు. 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తు ఉన్న సిమెంట్‌ కాంక్రీట్‌ సెగ్మెంట్ల అమరికకు అత్యంతాధునిక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు.  

అక్టోబర్‌ నాటికి పూర్తి: దానకిశోర్‌ 
దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జి పనులు అక్టోబర్‌ నాటికి పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ ఈ సందర్భంగా తెలిపారు. జీహెచ్‌ఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్‌ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నామన్నారు. బ్రిడ్జిపై మూడు లేన్ల వాహనాల రహదారితో పాటు వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లను సైతం నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.10 కోట్ల వ్యయంతో ఆకర్షణీయమైన ఇంటిగ్రేటెడ్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్రిడ్జిపై స్ట్రీట్‌ లైట్లు, ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ లైట్లు మొత్తం స్టీల్‌ బ్రిడ్జి పిల్లర్లలోనే అమర్చుతున్నట్టు వివరించారు. బ్రిడ్జికి ఇరు వైపులా అత్యాధునిక పద్ధతిలో స్టీల్‌ రైలింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

కేబుల్‌ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్‌–జూబ్లీహిల్స్‌ మధ్య దూరం గణనీయంగా తగ్గుతుందని, అంతే కాకుండా జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌ స్పేస్, గచ్చిబౌలి వరకు దాదాపు రెండు కి.మీ. దూరం తగ్గుతుందన్నారు. కొండాపూర్‌లో సెగ్మెంట్ల నిర్మాణం పూర్తి చేసి రాత్రి సమయంలో రోడ్డు మార్గం ద్వారా దుర్గం చెరువుపై అమరుస్తున్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ డైరెక్టర్‌ వెంకట నరసింహారెడ్డి, వెస్ట్‌ జోన్‌ కమిషనర్‌ హరిచందన, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్, శేరిలింగంపల్లి ఉప కమిషనర్‌ వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement