![Speaker Will Take Another Action On Komati Reddy Sampath - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/12/madhiii.jpg.webp?itok=uDgiNEc3)
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించిన విషయంలో తన పరిధిలో ఏం చేయగలనో చూస్తున్నానని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చారు. సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి.. కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా సస్పెండ్ చేశారని, ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని, స్పీకర్‌గా ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తూ.. వినతిపత్రం అందజేసింది. దాదాపు అరగంటకుపైగా జరిగిన ఈ భేటీలో స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వాదనలు విన్నారు. ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.
న్యాయం చేస్తారనే నమ్మకముంది: జానా
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదో ఘటనను సాకుగా చూపి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించడం, మిగతా సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని జానారెడ్డి స్పీకర్‌తో పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేస్తారనే నమ్మకంతో వచ్చామని, బహిష్కరించిన సభ్యులకు న్యాయం చేసి సభ ప్రతిష్టను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో గతంలో వచ్చిన తీర్పులను కూడా స్పీకర్‌కు వివరించారు. ఇక శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ కూడా తన వాదన వినిపించారు. ఎలాంటి తప్పూ చేయకున్నా, తమ స్థానాల్లోనే ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను కూడా సస్పెండ్ చేశారని... పంచాయతీరాజ్ చట్టంపై కనీస చర్చ జరగకుండా ఆమోదింపజేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క కూడా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ను కలసిన వారిలో సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లతో పాటు సీఎల్పీ ఉపనేతలు టి.జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, పద్మావతి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎంపీ ఎంఏ ఖాన్, మాజీ మంత్రులు దానం నాగేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, రవీంద్రనాయక్ తదితరులు ఉన్నారు.
దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం..: జానా
స్పీకర్ మధుసూదనాచారితో సమావేశమైన తర్వాత కాంగ్రెస్ నేతలు విలేకరులతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి సభకు హుందాతనం తీసుకురావాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వమైనా స్పందించి ప్రతిష్టను కాపాడుకోవాలని సూచించారు. మధ్యవర్తిగా స్పీకర్ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. లేదంటే ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. తనకున్న పరిధులు, సందర్భాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న రీతిలో స్పీకర్ హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. స్పీకర్ నిర్ణయం కోసం వారం రోజులు వేచి చూస్తామన్నారు. అప్పటికీ నిర్ణయం వెలువడకుంటే తెలంగాణలో శాసనసభను, సమాజాన్ని ఏ విధంగా అవమానపరుస్తున్నారనే విషయాన్ని రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేస్తామని.. జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment