సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరించడం ద్వారా రేగిన మంటలు హైకోర్టులో ఇంకా చల్లారలేదు. తమ బహిష్కరణకు సంబంధించి వారు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యం విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. న్యాయమూర్తిని ఉద్దేశించి ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’అంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఏఏజీ ఎదురుదాడి, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారిని ఈ నెల 15న తమ ముందు హాజరుపరచాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. రూ.10వేల పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందవచ్చునని ఇరువురు కార్యదర్శులకు స్పష్టంచేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివవంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టుకు సహకరించాల్సిన అదనపు ఏజీ ఎదురుదాడికి దిగారని, న్యాయవ్యవస్థను అవమానపరిచేలా మాట్లాడారని.. అయినా కూడా, ఈ కోర్టు తనను తాను నియంత్రించుకుంటూ తప్పని పరిస్థితుల్లో ఇరువురు కార్యదర్శులకు బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకసారి కోర్టు ధిక్కరణ కింద ఫారం–1 నోటీసులు అందుకున్న తర్వాత, ఇరువురు కార్యదర్శులు కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టంచేశారు.
మినహాయింపు ఎలా కోరతారు..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు గతేడాది తీర్పు వెలువరించారు. అయితే, ఈ తీర్పును అమలు చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని ఓ న్యాయవాది కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు నిరాకరించారు. కోర్టు ధిక్కరణ కింద ఫారం–1 నోటీసులు అందుకున్న ఇరువురు కార్యదర్శులు.. కోర్టు ముందు హాజరవుతారని తెలిపారని, మళ్లీ ఇప్పుడు హాజరు నుంచి మినహాయింపు ఎలా కోరతారని ప్రశ్నిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
నేను చెప్పేది వినండి...
తిరిగి ఈ కేసు మధ్యాహ్నం విచారణకు వచ్చినప్పుడు న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తరఫున హాజరైన అదనపు ఏజీ జె.రామచంద్రరావు విచారణను వాయిదా వేయాలని కోరబోగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘గతంలో కూడా మీరు ఇలాగే వాయిదా కోరారు. కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటున్న వారు కోర్టు ముందు హాజరవుతారని చెప్పారు. మరి కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటున్న వారు నిబంధనల ప్రకారం కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఉందా? లేదా? చెప్పండి’అని అడిగారు. దీంతో ఏఏజీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’అంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి అనుచితంగా వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును ఇంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏముంది? విచారించేందుకు ఏం ఆధారాలున్నాయి? నేను చెప్పేది వినండి’అంటూ తీవ్రస్వరంతో మాట్లాడారు. ఏఏజీ తీరుతో న్యాయవాదులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
గుడ్‌సెన్స్‌తో అడుగుతున్నా..
ఏఏజీ అంత తీవ్రంగా మాట్లాడినప్పటికీ.. న్యాయమూర్తి ఏ మాత్రం చలించకుండా, ‘నాన్సెన్స్‌తో కాదు.. గుడ్‌సెన్స్‌తో అడుగుతున్నా. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి’అని ఏఏజీని అడిగారు. కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తర్వాత, ధిక్కరణ ఎదుర్కొంటున్న వారు కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఈ ధిక్కార వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేదని రామచంద్రరావు చెప్పగా.. విచారణకు స్వీకరించినట్టు న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఇరువురు కార్యదర్శులు కోర్టు ముందు హాజరవుతారని గత విచారణ సందర్భంగా ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.
మీకు కావాల్సిన విధంగా...
ఈ దశలో ఏఏజీ మరోసారి తీవ్రస్థాయిలో ఊగిపోతూ.. కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేయాలని ధర్మాసనం ఆదేశాలు ఉండగా, ఎలా విచారణ జరుపుతారని ప్రశ్నించారు. ఈ కేసులో ఏదో చేయాలని ముందే నిర్ణయించుకుని (ప్రీ మైండెడ్) ఉంటే ఆ మేర ఉత్తర్వులు జారీ చేయవచ్చునని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీనియర్ న్యాయవాది వాయిదా కోరితే ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ అవసరం లేదని, దానిని మూసేయాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో చెప్పిందని ఏఏజీ చెప్పగా.. అలా జారీ చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. అయితే, అలా ఇవ్వొచ్చంటూ ఏఏజీ విసురుగా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోతుండగా, న్యాయమూర్తి ఆయన్ను ఆగాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం ప్రారంభించారు. కోర్టులో ఏఏజీ వ్యవహారశైలిని మొత్తం తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. గతంలో వాయిదాలు తీసుకున్న విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు. కోర్టుకు సహకరిస్తూ, న్యాయస్థానం ప్రతిష్టను కాపాడాల్సిన ఏఏజీ.. కోర్టుపై ఎదురుదాడికి దిగారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇరువురు కార్యదర్శులకు బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వాటీజ్ దిస్ నాన్సెన్స్?
Published Sat, Feb 9 2019 1:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment