సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావాన్ని కట్టడి చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం, బాధితులకు వైద్య సేవలు, లాక్‌డౌన్ నేపథ్యంలో తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల నడుమ మెరుగైన సమన్వయం సాధించడంతోపాటు బాధితుల గుర్తింపు, చికిత్స, కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఐటీ సాంకేతికతతో డ్పాటు తీసుకోవాలని నిర్ణయిం చింది. పలు ఫీచర్లతో కూడిన ప్రత్యేక యాప్‌ను రూపొం దించడంపై ఐటీ విభాగం ఇప్పటికే కొంత పురోగతి సాధించింది. పది రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా కరోనా బాధితుల గుర్తింపు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన వంటి అనేక చర్యలు సులభతరం కానున్నాయి. లొకేషన్ డేటా ఆధారంగా ఇప్పటివరకు ప్రభావితమైన వారు, వ్యాధి విస్తరణకు అవకాశం ఉన్న ప్రాంతాలు తదితర అంశాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకొనే వీలుంటుంది.
స్వీయ గృహ నిర్బంధంపై నిఘా...
ఐటీశాఖ రూపొందిస్తున్న కొత్త యాప్ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ గృహనిర్బంధం ఎంత మేరకు పాటిస్తున్నారనే విషయం తెలుసుకొనే అవకాశం ఉంటుంది. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఎప్పటికప్పుడు యాప్ ద్వారా వారి కదలికలు తెలుసుకొనేలా వీలుంటుందని ఐటీశాఖ వర్గాలు చెబుతున్నాయి. యాప్‌లోని ఈ–ఫ్రాప్ అనే హైపర్‌లింక్ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారు, వారిలో కరోనా లక్షణాలతోపాటు వారి సాధారణ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనే వీలుంటుంది. ఇప్పటికే సామాజిక పించన్ల పంపిణీలో ఉపయోగిస్తున్న ఐటీ సాంకేతికత ‘రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ’ని ఈ యాప్‌లో వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించామని, మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ఐటీశాఖ వర్గాలు వెల్లడించాయి.
స్టార్టప్‌ల ద్వారా వెంటిలేటర్ల తయారీ...
రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి విజృంభించినా అందుకు తగ్గట్లుగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చికిత్సలో కీలకపాత్ర పోషించే వెంటిలేటర్ల తయారీతోపాటు కరోనా పరీక్ష కిట్ల తయారీపై దృష్టి సారించింది. వెంటిలేటర్లు, కిట్ల తయారీ బాధ్యతను రెండు స్టార్టప్ కంపెనీలకు అప్పగించినట్లు తెలిసింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే వెంటిలేటర్లను ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ రూపొందించి నమూనాను కూడా తయారు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లు, పరీక్ష కిట్లను తయారు చేసే స్టార్టప్‌లను గుర్తించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment