పుష్కర రైళ్లలో ‘ప్రత్యేక’ దోపిడీ
* ప్రత్యేక రైళ్లలో వెళ్లేందుకు ప్రయాణికుల విముఖత
* రెగ్యులర్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ‘స్పెషల్’ దోపిడీకి తెరలేపింది. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరుగనున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ సాధారణ చార్జీలపై అదనపు వసూళ్లకు దిగింది. దీంతో ఈ రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకొనేందుకు ప్రయాణికులు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు రెగ్యులర్ రైళ్లకు మాత్రం డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది.
అదనపు చార్జీల కారణంగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల నిరాదరణకు గురవుతుండగా, రెగ్యులర్ రైళ్లకు మాత్రం రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. వీటిలో ఇప్పటివరకు 100 బస్సులు బుక్ అయినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు ఆర్‌ఎం గంగాధర్ తెలిపారు.
స్పెషల్ రైళ్లు-తత్కాల్ చార్జీలు
హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి భక్తులు విజయవాడకు చేరుకొనేవిధంగా, పుష్కరఘాట్‌లకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లకు రాకపోకలు సాగించే విధంగా సుమారు 220 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అన్ని రైళ్లలోనూ సాధారణ చార్జీల స్థానంలో తత్కాల్ చార్జీలు విధించారు. స్లీపర్ క్లాస్‌పైన సగటున రూ.100 నుంచి రూ.150 వరకు, థర్డ్ ఏసీ బెర్తులపైన రూ.250 నుంచి రూ.350 వరకు, సెకెండ్ ఏసీ పైన రూ.400 నుంచి రూ.500 వరకు అదనపు చార్జీలు విధించారు.
సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో, వేసవి సెలవుల్లో ప్రతి సంవత్సరం సాధారణ చార్జీలపైనే ప్రత్యేక రైళ్లు నడుపుతుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారి కృష్ణా పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు దోపిడీకి దిగింది. పుష్కరాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, శ్రీశైలం, బీచుపల్లి, నాగార్జునసాగర్‌లకు 400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఆగస్టు 12 నుంచి 25 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.