సాక్షి, నల్గొండ : ఉమ్మడి జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లను వీక్షించడానికి ఎంతో మంది వస్తుంటారు. శాతవాహన ఇక్ష్వాకుల కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిమాన్విత దేవాలయంగా విరాజిల్లుతున్న లక్ష్మీనరసింహదేవాలయం భక్తుల కొంగుబంగారంగా నిలుస్తోంది. తనివి తీరని అందాల పేట, జాలువారే జలపాతాలకు నిలయం చందంపేట. రాచకొండ ప్రకృతి రమణీయతకు మారు పేరు. ఇక్కడి సెలయేళ్లు, జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇలా చూడదగ్గ ప్రాంతాలెన్నో ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
యాదాద్రిని చూసొద్దాం రండి..
యాదగిరిగుట్ట (ఆలేరు) : పంచనారసింహ క్షేత్రంగా.. ఏకశిఖరుడి ఆలయంగా.. హరిహరులు కొలువైన గొప్ప మహిమాన్విత దేవాలయంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం గొప్పగా రూపుదిద్దుకుంటుంది. స్వామి సన్నిధిలో శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి, శ్రీసీతారాముల ఆలయాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు శ్రీసత్యనారాయణస్వామి వత్ర మండపం ఉంది.
పాతగుట్ట క్షేత్ర మహత్యం..
యాదాద్రిలో వెలిసే కంటే ముందుగా శ్రీస్వామి అమ్మవార్లు లక్ష్మీ అమ్మవారితో సహా ఒక ఆరణ్యంలో వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. క్రమంగా ఈ ప్రాంతమే పాతగుట్టగా మారింది. ఇక్కడికి స్వామి వారు అమ్మవారితో గుర్రంపై వచ్చాడని పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ మరో విష్ణు పుష్కరిణి ఉంది.
గుట్టలో చూడదగ్గ ప్రదేశాలు..
యాదగిరిగుట్ట పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో శ్రీలక్ష్మీహయగీవ్ర ఆలయం, టెంపుట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న పెద్దగుట్ట, పాతగుట్ట రోడ్డులో సాయిబాబా ఆలయం, రెండు కిలోమీటర్ల దూరంలోని మైలార్‌గూడెం గ్రామంలో సాయినాథ ఆలయం, మెయిన్‌రోడ్డులో వైకుంఠద్వారం, తులసీకాటేజీలో యాదరుషి విగ్రహం ఆకట్టుకుంటున్నాయి. యాదగిరిగుట్టకు 4కిలోమీటర్ల దూరంలో ప్రాచీన వీరభద్రస్వామి ఆలయం, మినీ ట్యాంక్‌బండ్‌లు ఉన్నాయి. అదేవిధంగా ఆర్యవైశ్య సత్రానికి చెంది న లోటస్ టెంపుల్, వాసవీమాత ఆలయం ఉంది.
పసిడిగొండ.. ఉండ్రుగొండ
పచ్చనిచెట్లతో నిగనిగలాడే ప్రకృతి సంపద, ఎత్తైన దుర్గం ప్రాకారాలు, 20 దర్శనీయ ఆలయాలు, ఎటుచూసినా కొండలు.. లోయలు, విలువైన ఔషధ మొక్కలతో అలరారుతున్న ప్రదేశం చివ్వెంల మండల పరిధిలోని వల్లభాపురం ఆవాసం ఉండ్రుగొండ. హైదరాబాద్– విజయవాడ మార్గంలో 64 వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు, సూర్యాపేటకు 13 కిలో మీటర్ల దూరంలో ఈ గిరదుర్గం కొలువై ఉంది.
గిరిదుర్గంపై వెలిసిన ఆలయాలు...
ఉండ్రుగొండ కోట విస్తీర్ణం 11 కిలోమీటర్లు, ఎత్తు 900 మీటర్లు. 1376 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ గిరిదుర్గంపై శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, గోపాల స్వామి, శివాలయం, లింగమంతులస్వామి, మల్లేశ్వరస్వామి, 14 కిమీ పొడవైన దుర్గ ప్రకారాలు, రాతితో నిర్మించిన రాజుల దర్వాజాలు ఉంటాయి. లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న గుట్టను కాపురాల గుట్ట, పెద్దగుట్ట అని పిలుస్తారు. ఈ గుట్టలో చాకలి బావి, మంత్రిబావి ఉన్నాయి. వాటిలో ఇప్పటికి నీరు ఉంది. కాకతీయుల కాలంలో ఈ కట్టడాలు నిర్మించినట్లుగా చెబుతుంటారు.
గుట్టలను కలుపుతూ సొరంగాలు...
గిరిదుర్గంలో ఉన్న ఏడు గుట్టల చుట్టూ రాతి కట్టడాలు నిర్మించడంతో పాటు వాటిని కలుపుతూ సొరంగ మార్గాలు ఉన్నాయి. గుట్టపై ఓ చోట దర్వాజ నుంచి నేరుగా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి శివాలయాల వరకు దారి ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నా యి. శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వెలిసిన గుట్ట కు ఎదురుగా దక్షిణం వైపు పెద్ద కోనే రు ఉంది. ఇందులో ఎప్పటికీ నీరు ఉంటుంది.
నాటి జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం..
ఘనమైన చరిత్ర కలిగిన దేవరకొండ ఖిలా నాటి జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. 700 సంవత్సరాలకు పూర్వం రాచరిక పాలన, శిల్పకళా సంపద కళ్లకు కట్టినట్లు ఖిలాలో కనిపిస్తాయంటే అతిశయోక్తి లేదు. క్రీ.శ.1230లో రేచర్ల పద్మనాయక వెలమరాజుల రాజ్యానికి దేవరకొండ ఖిలా రాజధానిగా ప్రఖ్యాతి గడించింది. ఖిలాపై నిర్మించిన రాతి కట్టడాలు ఆనాటి శిల్పవైభవానికి నిదర్శనంగా నిలిచాయి. దేవరకొండ ఖిలా దుర్గంలో సుమారుగా 300లకుపైచిలుకు చిన్న, పెద్ద బురుజులు, 9 ప్రధాన ద్వారాలు, 32 చిన్న ద్వారాలు, ఇతరత్రా దిగుడు బావులు, కోనేరులు, ధాన్యాగారాలు ఎన్నో ఉన్నాయి.
సాగర సోయగం..
అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ బౌద్ధమతస్థులకు, పర్యాటక ప్రేమికులకు రానున్న రోజుల్లో కేంద్ర బిందువు కానుంది. నాగార్జునుడు నడయాడిన నందికొండ ప్రాంతం తవ్వకాల్లో లభ్యమైన శాతవాహన ఇక్ష్వాకుల కాలం నాటి చారిత్రక నిర్మాణాలు, మహాయాన బౌద్ధమత అవశేషాలు నాగార్జునకొండలో భద్రపరిచారు. ఇక్కడ ఆచార్యనాగార్జునుడు ఏర్పాటు చేసిన బౌద్ధవిశ్వవిద్యాలయానికి సంబంధించిన ఆరామాలు, విహారాలు, స్తూపాలు, మండపాలు నేటికీ చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. నాగార్జునకొండ మ్యూజియంలో ప్రత్యేకంగా భద్రపరిచిన బుద్ధదాతువులు నేటికీ బౌ ద్ధమతస్థుల నుంచి ప్రత్యేక పూజలందుకుం టున్నాయి. తవ్వకాల్లో మహాస్థూపం మధ్యలో మట్టికలశం, రాగి కలశం, వెండి కలుశం దానిలోపల బంగారు కలశం, వెండి బంగా రు పుష్పాల మధ్యన బుద్ధదాతువులు లభ్యమయ్యాయి. వీటిలో కొన్నింటిని అప్పట్లో సారనాథ్‌కు తరలించగా మరికొన్ని నాగార్జునకొండ మ్యూజియంలో భద్రపరిచారు.
బుద్ధవనం..
నాగార్జునసాగర్‌లో 279 ఎకరాల్లో నిర్మాణమవుతున్న శ్రీపర్వతారామం పేరుతో పిలువబడే బుద్ధవనం తెలంగాణ సిగలో మణిలా మెరువనుంది. ఆసియాలోనే పెద్దదైన కాంక్రీట్ మహాస్థూపంతో పాటు బుద్ధుడి జీవిత దశలు తెలిపే బుద్ధచరిత వనం, జాతక వనంతో పాటు ప్రపంచంలోని పలుదేశాల్లో ఉన్న స్థూపాల నమూనాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
పర్యాటక కేంద్రం.. పానగల్లు
జిల్లా కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు ఒకప్పటి కాకతీయ సామంతరాజుల పరిపాలనలో విలసిల్లిన పట్టణం. ఇక్కడి ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం, మ్యూజియం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
ఛాయా సోమేశ్వరాలయం..
ఇది త్రికూటాలయం. దక్షిణముఖద్వారంతో తూర్పు వైపున సూర్యుడు, ఉత్తర దిక్కున విష్ణు మూర్తి, పడమరన శివాలయం కలిగి ఉన్నాయి. ఈ శివాలయంపై వెలుతురు ఉన్నంత సేపు చిక్కటి నీడ పడుతుండటంతో ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయంగా పేరు వచ్చింది.
పచ్చల సోమేశ్వరాలయం..
ఇది పానగల్లు నడిబొడ్డున ఉన్న శివాలయం. ఇక్కడి ప్రధాన ఆలయంలో నవరత్నాలలో ఒక్కటైన పచ్చ పొదిగి ఉండడంతో ఈ ఆలయానికి పచ్చల సోమేశ్వరాలయంగా పేరు వచ్చింది. ప్రధాన ఆలయం వెనుక భాగంలో శివపురాణం చెక్కబడి ఉంది.
మ్యూజియం..
మ్యూజియంలో పానగల్లు ప్రాంతంలోనేకాక ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో లభించిన శిల్ప సంపద, శాసనాలు, రాతి శిలాయుగపు ఆయుధాలు, అప్పటి రాజులు వాడిన కత్తి, రాళ్లు ఇక్కడ భద్రపరిచారు.
పరవశింపజేసే ప్రకృతి అందాలు
చుట్టూ కొండలు, జాలువారే జలపాతాలు, పచ్చని రంగు అల్లుకున్న పంట పొలాలు, మనుసును పరువశింపజేసే ప్రకృతి అందాలు, కృష్ణమ్మ పరవళ్లు, అరకును తలపించే దేవరచర్ల అందాలు, బుర్ర గుహలను తలపించే గాజుబిడెం గుహలు, అధ్యాత్మికతను పెంచే ఆలయాలు, సుమారు 300 ఏళ్ల కాలం నాటి బృహత్‌కాల సమాధులు చూడాలంటే ఒక్కసారి చందంపేటకు వెళ్లాల్సిందే. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పెద్దమునిగల్ అంభ భవాని ముత్యాలమ్మ దేవాలయం, వైజాక్ కాలనీ జలాలు, కాచరాజుపల్లి గాజుబిడెం గుహలు, వైజాక్ కాలనీలో బోటింగ్, ఏలేశ్వరం మల్లయ్య గట్టు, జింకల పార్క్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
వెళ్లాల్సింది ఇలా..
హైదరాబాద్–నాగార్జునసాగర్ జాతీయ రహదారి నుంచి కొండమల్లేపల్లికి చేరుకొని అక్కడి నుంచి దేవరకొండకు చేరుకోవాలి. దేవరకొండ, డిండి మార్గమధ్యంలోని పెద్దమునిగల్ స్టేజీ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కొత్తపల్లి మీదుగా 20 కి.మీ. ప్రయాణిస్తే.. పెద్దమునిగల్ అంభ భవాని దేవాలయం వస్తుంది. అక్కడి నుంచి 7 కి.మీ. దూరంలో ఉన్న వైజాగ్ కాలనీకి చేరుకోవచ్చు. అక్కడి నుంచి వైజాగ్ కాలనీ వద్ద కృష్ణానది వెనుక జలాల్లో బోటింగ్ చేయడంతోపాటు ఏలేశ్వరం మల్లయ్యగట్టు, జింకల పా ర్క్‌కు మరబోట్ల ద్వారా ప్రయాణించే అవకాశం ఉంది. అక్కడి నుంచి మరో ఐదు కి.మీ. ప్రయాణిస్తే కాచరాజుపల్లి గ్రామానికి చేరుకుంటాం. ఆ గ్రామం నుంచి రెండు కి.మీ. ప్రయాణిస్తే గాజుబిడెం తండా వస్తుంది. అక్కడి నుంచి కాలినడకన వెళ్తే గాజుబిడెం గుహలు వస్తాయి. అక్కడ నుంచి 12 కి.మీ. ప్రయాణిస్తే సర్కిల్‌తండా గ్రామం వ స్తుంది. అక్కడి నుంచి చందంపేట మార్గమధ్యలోని సర్కిల్ తండా నుంచి 8కి.మీ. ప్ర యాణిస్తే అరకు అందాలను తలపించే దేవరచర్ల గ్రామానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 2కి.మీ. కాలినడకన ప్రయాణిస్తే దేవరచర్ల మునిస్వామి ఆలయానికి చేరుకుంటాం.
ప్రకృతి అందాల రాచకొండ
రాచకొండ తెలంగాణ ప్రాంతానికి ఆనాడు రాజధానిగా వెలిసిన గొప్ప నగరం. తెలంగాణ ప్రాంతమంతటికీ పద్మనాయక వంశీ యుల ఏలుబడిలో రాజధానిగా చరిత్ర పుట్టల్లో నిలిచింది. రాచకొండ యాద్రాది జిల్లా సరిహద్దులో సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలో ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి 40కి.మీ, మండల కేంద్రం నుంచి 20కి.మీ, చౌటుప్పల్ నుంచి 30కి.మీ.దూరంలో ఉంది.పద్మనాయక వంశీయులు కాలంలో నిర్మించిన దుర్గములలో రాచకొండ ఒకటి.
పద్మనాయక వంశంలో ఎర్రదాచనాయుడుతో మొదలైన చరిత్రలో సర్వజ్ఞ రావు సింగ భూపాలుడు (సర్వజ్ఞ సింగ భూపాలుడు) ప్రభువు చివరి వాడు. ఈయన కాలంలో ఎన్నో ఉజ్వల ఘట్టాలు చరిత్రలో చోటు చేసుకున్నాయి. కళలు, సాహిత్యానికి పద్మవంశీయుల కాలం స్వర్ణయుగం. ఆయన ఎన్నో అపూర్వమైన కట్టడాలు నిర్మించారు. రాచకొండ రెండు పర్వతములపై నిర్మించబడినది. ఒకటి రాజు కొండ, రెండోవది నాగనాయుని కొండ. ఈ రెండిటి చుట్టూ పెద్దపెద్ద రాళ్లతో ప్రాకార దుర్గములను నిర్మించారు. శత్రువులు కూడా ప్రవేశించలేనంత కట్టడం. గృహ ప్రాంగణాలు, పుర వీధులు నేటి ఆధునిక సాంకేతికత కంటే గొప్పగా ఉన్నాయి.
అపూర్వమైన రాజ భవనం, సభా మందిరం, రాచనగరం శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. సంకేళ్ల బావితో పాటు చెరువులున్నాయి. రాచకొండలో పురాతన రామాలయం ఉంది. అక్కడ బమ్మెరపోతన పూజలు చేశాడని చరిత్ర చెబుతోంది. గుçప్త నిధుల తవ్వకాల్లో అతి పెద్ద శివలింగం బయటపడింది. ఈ శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఇక్కడ దేవాలయం నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాచకొండ అటవీలో ఆకట్టుకునేవి జాతీయ పక్షి నెమలి, నక్షత్ర తాబేళ్లు.
Comments
Please login to add a commentAdd a comment