గద్వాల క్రైం: పిల్లలు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో గౌరవంగా బతకాలని తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుంటారు. అయితే ఇక్కడే యువత ప్రేమనే మాయలో పడి తప్పటడుగు వేస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహభావంతో మెలగాల్సిన క్రమంలో చెడు ఆలోచనలకు దారి తీస్తోంది. దీంతో విద్యాభ్యాసానికి చెక్ పెడుతున్నారు. కన్నవారి కలలు దూరం చేస్తూ కష్టాల సుడిగుండంలో పడుతున్నారు.
పరువు హత్యలే..
ప్రేమ మాయలో పడిన యువత పెద్దల మాటలు వినకుండా రహస్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఆలయాల్లో స్నేహితుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ కులం, మతం కాని వాడిని పెళ్లి చేసుకుందని తీవ్ర మనోవేదనకు లోనవుతారు. సమాజం, బంధువులు, ఇరుగు పొరుగు వారు తమను చిన్నచూపు చూస్తారనో, కుటుంబ పరువు, ప్రతిష్ట దిగజారిందనే ఆవేశంలో సొంత బిడ్డలను సైతం హత్యచేసి పరువు దక్కిందని భావిస్తుంటారు. చివరకు కుటుంబ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు.
కట్టుబాట్లంటూ..
జాతి, మతం, కులమంటూ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలోనూ చాలామంది కట్టుబాట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణాల్లో అంతగా కనిపించకపోయినా పల్లెల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. తమ పిల్లలు తప్పు చేస్తే పరువు పోతుందనే ఆలోచనలో ఉంటారు. ఇటీవలే జిల్లాలోని మానవపాడు మండలం కల్లుకుంట్లకు చెందిన దివ్య(22) పరువు హత్యకు బలైంది. పేగు బంధం కంటే పరువు, కులమే ముఖ్యమనే ధోరణిలో తల్లిదండ్రులే ఆమెను హతమార్చారు. చివరికి వారు జైలు పాలయ్యారు. జిల్లాలో ఈ సంఘటన కలకలం రేగింది.
పెద్దల ఆలోచనల్లో మార్పు రావాలి..
కుల వ్యవస్థ కంటే మానవ సంబంధాలు చాలా ముఖ్యం. మారుతున్న కాలనుగుణంగా యువత మార్పు కోరుకుంటున్నారు. వారి ఆలోచనలకు పెద్దలు మద్దతివ్వాలి. నవ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. వేరే మతం, కులం అంటూ బేధాభిప్రాయాలు లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాలను గౌరవించాలి. మూర్ఖత్వంతో పరువు పోతుందని సొంత బిడ్డలను హత్య చేయడం నేరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కల్పించిన స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తే చర్యలు తప్పవు.– యాదగిరి, డీఎస్పీ, గద్వాల
ప్రజల్లో చైతన్యం రావాలి..
సమాజంలో అందరం సమానమే. కులం, మతం, ఆచారాలు, కట్టుబాట్లు అంటూ అనాగరికులుగా ప్రజలు సమాజంలో జీవనం సాగిస్తున్నారు. కులాంతర వివాహాలతో ప్రజల్లో భేషజాలు తగ్గుముఖం పడుతాయి. ఒకరిపై ఒకరు ప్రేమతో మెలుగుతారు. నేడు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కులం, మతం అడ్డుగోడలుగా ఉన్నాయి. ప్రభుత్వం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.– జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, చైతన్య మహిళా సంఘం, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment