ఆడపిల్ల భారమన్నారు..! | special story on women empowerment | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల భారమన్నారు..!

Feb 16 2018 8:26 AM | Updated on Feb 16 2018 8:26 AM

special story on women empowerment  - Sakshi

అనూష , సంధ్య

హిమాయత్‌నగర్‌: ఆ బాలికలు ఎన్నో ఆశలు... ఆశయాలతోచదువుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆకాంక్షలతో కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. కానీ... ఆ ఆశలు అడియాసలయ్యాయి. కలల సౌధం కుప్పకూలింది. ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. ఇక ఈదరిద్రాన్ని మేం భరించలేమని కుటుంబసభ్యులు తీసుకున్ననిర్ణయానికి ఆ చిన్ని హృదయాలు తల్లడిల్లాయి. బాలల హక్కుల సంఘం సహాయంతో బాల్య వివాహం బారి నుంచి బయటపడిన ఆ చిన్నారులు... అవమానాలను దిగమింగి, ఆటుపోట్లను అధిగమించి ఇప్పుడు చదువు, ఆటల్లో రాణిస్తున్నారు.  

చదువూ సంధ్య..
 ‘తమ్ముడు.. నీ కూతుర్ని ఇంకెంత కాలం చదివిస్తావ్‌ రా? చదివించింది చాలు... ఇక పెళ్లి చేసేయ్‌. మంచి సంబంధం చూద్దాం. ఈ దరిద్రాన్ని ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటావ్‌. ’
   – ఇదీ సంధ్యకు మేనత్త నుంచి ఎదురైన పరిస్థితి 

హయత్‌నగర్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వగ్లాపురం మల్లేష్, సూర్యకళల పెద్ద కుమార్తె సంధ్య. ‘మాకు ఆస్తి లేదు. పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలని మా మేనత్త, మామయ్యలు.. మా నాన్నకు చెప్పారు. 2016 ఏప్రిల్‌ 20న వివాహం నిశ్చయించారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకొని హోమ్‌కు తీసుకెళ్లారు. అయితే పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురై నాన్న చనిపోయారు. బంగారం లాంటి మనిషిని నువ్వే చంపేశావ్‌.. చదువుకొని ఏం సాధిస్తావ్‌ అంటూ సూటిపోటి మాటలతో నన్ను కుంగదీశార’ని ఆవేదన వ్యక్తం చేసింది సంధ్య.

తిట్టినోళ్లే మెచ్చుకున్నారు...
‘నాకు ఏప్రిల్‌ 3న ఎంగేజ్‌మెంట్‌ నిశ్చయించారు. అప్పుడు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకుంటాను అంటేనే.. నువ్వు పరీక్షలకు వెళ్లేది అంటూ ఇంట్లో షరతు పెట్టారు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని సోషల్‌ పేపర్‌–1 పరీక్ష రాయలేదు. బాలల హక్కుల సంఘం కృషితో సోషల్‌ పేపర్‌–2 రాశాను. ఒక్క పేపర్‌ రాయకపోయినప్పటికీ 7.5 జీపీఏ సాధించాను. అప్పుడు అందరూ మెచ్చుకున్నారు. నన్ను తిట్టిన వాళ్లే.. నీలో ప్రతిభ ఉందని ప్రోత్సహించారం’టూ  చెప్పింది సంధ్య. ఈమె ప్రస్తుతం బీఎన్‌రెడ్డినగర్‌లోని ఎన్‌ఆర్‌ఐ కళశాలలో ఇంటర్‌ చదువుతోంది. 

ఆటా అనూష...
 ‘తల్లి.. మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు. వేరే ఆమెతో ఉంటున్నాడు. అన్నీ చూసుకోవాల్సిన మీ నాన్న.. మిమ్మల్ని మాపై వదిలేశాడు. అందుకే నీకు పెళ్లి చేసేస్తాం. మా బరువు, బాధ్యత తీరిపోతుంది’    
– ఇదీ అనూషకు అమ్మమ్మ–తాతయ్యల నుంచి ఎదురైన పరిస్థితి   
 
సరూర్‌నగర్‌లో నివసించే బొడ్డుపల్లి శ్రీను, అరుణల కుమార్తె అనూష. శ్రీను లారీ డ్రైవర్, అరుణ గృహిణి. ‘మా నాన్న మమ్మల్ని వదిలేశాడు. వేరే ఆమెతో కాపురం పెట్టాడు. ఇల్లు గడవడం కూడా కష్టమవడంతో నాకు త్వరగా పెళ్లి చేసి పంపేయాలనే ఆలోచన అమ్మమ్మ, తాతయ్యలకు వచ్చింది. గతేడాది మే 4న వివాహం చేసేందుకు సిద్ధమవగా, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకున్నారు. కాచిగూడలోని హోమ్‌లో 20 రోజులు ఉన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. పెళ్లి చేసుకోకుండా ఇంకెంత కాలం ఉంటావే.. అంటూ తిట్టారు. వాటన్నింటినీ దిగమింగుతూ కాలేజీకి వెళ్తున్నాను. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్నాన’ని వివరించింది అనూష.   
 
క్రికెట్, రగ్బీలో మేటి..   
‘నాకు ఆటలంటే ఇష్టం. మా పీఈటీ రాఘవరెడ్డి సార్‌ నన్నెంతో ప్రోత్సహించారు. క్రికెట్‌ బాగా ఆడడం నేర్చుకున్నాను. ఇప్పుడు స్టేట్‌ టీమ్‌లో నేనొక ఫాస్ట్‌ బౌలర్‌ని. మధ్యప్రదేశ్, గుజరాత్, మన రాష్ట్రంలోని గుర్రంగూడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాను. భారత్‌ తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది నా కోరిక. క్రికెట్‌తో పాటు రగ్బీ అంటే కూడా నాకిష్టం. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాన’ని చెప్పింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement