
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డ్ విద్యార్ధులు భవిష్యత్తుతో ఆటలు ఆడుతోంది. పరీక్షలు పూర్తయి నెల రోజులు కావస్తున్న ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో విద్యార్ధులతోపాటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణల, ఆంధ్రప్రదేశ్‌లలో ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ శుక్రవారం రోజున ఫలితాలను విడుదల చేయగా.. తెలంగాణలో మాత్రం ఇంటర్ ఫలితాల విడుదలపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
పరీక్షా పత్రాల ముల్యాంకన పక్రియ ముగిసన తర్వాత మార్కుల జాబితాను కంప్యూటర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ బాధ్యతలను అనుభవం లేని సర్వీస్ ప్రొవైడర్లకు అప్పగించడంతో.. ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంటర్ బోర్డు పెద్దలు కమిషన్ల కోసమే సదురు సంస్థకు బాధ్యతలు అప్పగించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడుతున్నాయి. దీంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. అయితే ఎప్పటిలోగా ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామనే విషయాన్ని బోర్డ్ పెద్దలు చెప్పలేకపోతున్నారు. దీనిపై స్పందించడానికి అధికారులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు.