నాగార్జునసాగర్ రెండు రాష్ట్రాల వరప్రదాయిని, లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు, పట్టణాలకు తాగునీరు..అంతకు మించి రెండు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు అందిస్తున్న ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్వహణకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. వాచ్‌మన్‌లే ఇంజినీర్లలా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యాం నిర్వహణ సిబ్బంది మాట అటుంచి ఐదేళ్లుగా మెకానికల్ ఇంజినీర్ లేకపోవడం ఇక్కడి దుస్థితికి అద్దంపడుతోంది. వేసవి సీజన్‌లోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్ల మరమ్మతులతో పాటు డ్యాం అంతర్భాగంలోని గ్యాలరీలలోని లీకేజీలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
క్రస్ట్‌గేట్లను ఎత్తి,దించడంతో పాటు ఇనుపతాళ్లకు గ్రీజింగ్ చేయడం, దిగువన తుప్పు పట్టిన (వాక్‌వేప్లేట్లు)ఇనుప నిచ్చెనలకు వెల్డింగ్ పెట్టడం, క్రస్ట్‌గేట్ల వెంట నీరు లీకేజీ కాకుండా గేట్లకు ఇరువైపులా రబ్బరు సీళ్లను తొడగ డం లాంటిపనులు పూర్తిచేయాలి. ఎక్కడైనా అలైన్‌మెంట్ పాడైతే వాటిని సరిచేయాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా డ్యాంలో వెల్డర్ లేకపోవడం శోచనీయం. ఇటీవల సాగర్‌డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ సాగర్‌ను సందర్శించి చేయాల్సిన మరమ్మతుల గురించి వివరించింది. బ్రిడ్జిమీది గేట్లు అలైన్‌మెంటు తొలగి ఒకవైపు ఒరిగి ఉండటం, వాటిని లేపినపుడు మొరాయిస్తుండటం, వాక్‌వేప్లేట్లు విరిగిపోవడం తదితర పనులను రివ్యూ ప్యానల్ గుర్తించింది.
ఈపనులన్నింటినీ గత ఏడాది మొదలు పెట్టినప్పటికీ సిబ్బంది కొరతతో మమ అనిపించారు. క్రస్ట్‌గేట్ల నిర్వహణ సెక్షన్‌ను, అందులో పనిచేసే ఉద్యోగులను అవగాహనలేని అధికారులు ఆంధ్రాకు తరలించడంతో ఆ ఉద్యోగులు పనిచేయడం వదిలి తెలంగాణకు రావడానికి అధికారులు,రాజకీయనాయకుల చుట్టూ తిరగుతూ నానాఅగచాట్లు పడ్డారు. దీంతోగేట్లపనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈలోపు సీజన్ మారింది. జలాశయంలోకి నీరురావడంతో ఇక ఆ పనులు అలాగే మిగిలి పోయాయి. చాలామంది ఉద్యోగులు ఆంధ్రాకు తరలిన వారు ఆ ప్రాంతీయులు అక్కడే ఉండిపోయారు.
ఐదుగురే సిబ్బంది..
ప్రస్తుతం సరిపోను సిబ్బంది లేకపోవడంతో పనులు ఈ ఏడాది మొదలైనప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. వాచ్‌మన్‌లే ఇంజినీర్లలా పనులు చేస్తున్నారు. డ్యాం మెయింటెనెన్స్ డివిజన్‌లో సిబ్బంది కేవలం ఐదుగురే ఉన్నారు. దీంతో పనులు చేయడం కష్టంగా మారింది. వాటర్‌సప్లయ్, బీఅండ్‌ఆర్, సెంట్రల్‌స్టోర్‌లలో పనిచేసే సిబ్బందిని డ్యాం నిర్వహణకు బదిలీచేసినారెండేళ్లుగా ఆయాసెక్షన్ల నుంచి రిలీవ్‌కాని ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది కొంతమందిని బదిలీ చేశారు. అయినా వారు రిలీవ్ అయ్యి నేటికీ విధుల్లో చేరలేదు. పాతస్థానాలలోనే విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత పైఅధికారులు డ్యాం ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని క్రస్ట్‌గేట్ల డివిజన్‌కు ఉద్యోగులను బదలాయించి ముఖ్యమైన పనులను చేయాల్సిన ఆవశ్యకతఎంతైనా ఉంది. జూలై మాసం నుంచే వరదలు వస్తేపనులు చేయడం కష్టంగా మారనుంది. డ్యాం నిర్వహణ డివిజన్‌కు ఇతర డివిజన్‌ల నుంచైనా సిబ్బందిని తరలించి తాత్కాలిక మరమ్మతు పనులను చేయించాల్సిన అవసరం ఉంది.
‘సాగర్’ నిర్వహణ ఎలా?
Published Fri, May 22 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement