ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో నీటి పారుదల శాఖ చూపుతున్న నిర్లక్ష్య వైఖరి పెను ప్రమాదాలను కొని తెచ్చేలా ఉంది. జూన్ నుంచి ప్రాజెక్టులకు వరద మొదలయ్యే అవకాశాలున్నా.. ఇంతవరకు గేట్ల నిర్వహణ, కాల్వల ద్వారా నీటి సరఫరా పరిశీలనా సిబ్బంది, జనరేటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషీయన్లు, లష్కర్‌ల నియామకాల్లో అంతులేని జాప్యం చేస్తోంది. అంచనాకు మించి వరదలొచ్చే సందర్భాల్లో సిబ్బంది కొరతతో ముప్పు పొంచి ఉన్న సందర్భాలు కళ్లముందే కనిపిస్తున్నా, ఆ శాఖ అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు.
గతం మరిచారా?
గోదావరి, కృష్ణా నదీ పరివాహకంలో ఆకస్మిక వరదలు రావడం రాష్ట్రానికి కొత్తేమీ కాదు. గోదావరి బేసిన్‌లోని మూడేళ్ల కింద ఎల్లంపల్లికి తక్కువ సమయంలోనే ఎక్కువ వరద రావడంతో మిడ్‌మానేరు కట్ట తెగిపోయింది. 2016లో సింగూరులో 20 రోజుల్లోనే 75 టీఎంసీల మేర వరద రాగా, గేట్ల నిర్వహణ సరిగా లేక వాటిని ఎత్తడంలో నానా తంటాలు పడాల్సి వచ్చింది. గతేడాది కడెం ప్రాజెక్టు రెండో నంబర్ గేటు కౌంటర్ వెయిట్ తెగిపోయిన కారణంగా నీటి ఒత్తిడికి పక్కకు ఒరిగి గేటు తెరుచుకోలేదు. సాత్నాల ప్రాజెక్టులోనూ 45 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులోకి 90 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇదే సమయంలో కరెంట్ పోవడం, జనరేటర్‌పై పిడుగు పడటంతో గేట్లు మూయడంలో అయోమయం నెలకొంది. గేట్లు మూసే ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు ఎవరూ లేకపోవడం, వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కృష్ణా బేసిన్‌లోనూ 2009లో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 25 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద రాగా, అదే ఏడాది నాగార్జునసాగర్‌కు 14.5 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 11.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ సమయంలో శ్రీశైలం పవర్ హౌజ్ మునిగిపోయింది.
వీరే కీలకం...
వరదలు వచ్చే సమయాల్లో వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు, గేటు ఆపరేటర్లు, హెల్పర్లు, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, లష్కర్‌ల పాత్ర కీలకం. అయితే నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ సహా సుద్ధవాగు, స్వర్ణ, మత్తడివాగు, పాలెంవాగు, తాలిపేరు, కిన్నెరసాని, జూరాల, సింగూరు వంటి ఏ ప్రాజెక్టుల పరిధిలోనూ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్‌కు తగినంత సిబ్బంది లేరు. మొత్తంగా అన్ని రకాల సిబ్బంది కలిపి 5,600 మంది వరకు అసవరం ఉండగా ప్రస్తుతం 1,700 మంది మాత్రమే ఉన్నారు. కనిష్టంగా మరో 3 వేల మందిని నియమించాల్సి ఉన్నా ఇంతవరకు వారి నియామకాలపై నీటి పారుదల శాఖ జాప్యం చేస్తూ వస్తోంది. జూన్‌లో వర్షాలు మొదలు కాకముందే నీటి పారుదల శాఖ మేల్కొనాలని నీటి పారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment