
సాక్షి, హైదరాబాద్:హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా పార్టీ ప్రధానకార్యదర్శి, శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. హుజూర్‌నగర్‌లోనే మకాం వేసి పార్టీ ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలు చేసే బాధ్యతను పల్లాకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను పల్లా సమన్వయం చేస్తారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో, ఇతర జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ యంత్రాంగా న్ని సన్నద్ధం చేయాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు.
సీనియర్ నాయకులు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ ఆదేశిం చారు. కాగా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా నియమితులైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి స్థానికంగా ప్రచారం, సమన్వయం కోసం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేస్తారు. పార్టీ తరఫున నిర్వహించే సభలు, ర్యాలీలు, కేసీఆర్ పాల్గొనే కార్యక్రమాలు తదితరాలకు సంబంధించి పల్లా తుదిరూపు ఇస్తారు. ఈ నెల 26న పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు.
పాలేరు, ఇతర ఎన్నికల అనుభవంతోనే..!
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కంటే ముందు ప్రచార పర్వంలో దూసుకెళ్లేలా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేశారు. ఎన్నికల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశంతో తనకు సన్నిహితంగా ఉండే పల్లాకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పల్లాతో కలిసి పనిచేయా ల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గతంలో పాలేరు ఉప ఎన్నికతో పాటు, ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికల్లో పల్లా ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లోనూ పల్లా పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనగామ, భువనగిరి జిల్లాల పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా పనిచేశారు. ఆయనకు పార్టీ బాధ్యత అప్పగించిన ప్రతి సందర్భంలోనూ టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితం రావడంతో.. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బాధ్యతను పల్లాకు అప్పగించారు.