* సీఎం అధ్యక్షతన ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
* సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వానికి సలహాలివ్వాలని ప్రణాళిక శాఖ మార్గదర్శకాలు
* ప్రణాళిక మండలికి అన్ని శాఖలు సహకరించాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి’ ఏర్పాటైంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మండలికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య విడుదల చేశారు. ప్రణాళిక యంత్రాంగాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు అందులో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుని సమగ్రాభివృద్ధి సాధించడానికి వీలుగా అర్హులైన మేధావుల నుంచి సూచనలను స్వీకరించి, ప్రభుత్వానికి ప్రణాళిక మండలి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్‌అఫీషియో వైస్-చైర్మన్‌గా ఆర్థికమంత్రి వ్యవహరిస్తారు. మండలి ఉపాధ్యక్షున్ని ప్రభుత్వం నియమిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పదవిలో టీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. సభ్యులుగా సీఎస్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శితోపాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. సభ్య కార్యదర్శిగా ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరిస్తారు.
ప్రణాళిక మండలికి మార్గదర్శకాలు
- అభివృద్ధి కోసం సంస్థల ఏర్పాటుకు పాటించాల్సిన విధానాలు సూచించడం.
- ఆర్థికాభివృద్ధి పర్యవేక్షణ, మదింపు. వివి ద శాఖలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల మెరుగుకు సలహాలివ్వడం.
- రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఏ అంశంపైనైనా సలహాలు అందజేయాలి.
- వార్షిక, పంచవర్ష ప్రణాళికల రూపకల్పనలో సలహాలు ఇవ్వాలి.
- మండలి కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని ప్రణాళిక శాఖ అందించాలి.
- మండలికి అడిగిన గణాంకాలను ప్రభు త్వ శాఖలన్నీ వెంటనే అందించాలి. రాష్ట్ర, కేంద్రస్థాయిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మండలి దృష్టికి తీసుకురావాలి.
రాష్ర్ట ప్రణాళిక మండలి ఏర్పాటు
Published Fri, Dec 19 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement