చిన్న రైల్వేస్టేషన్లలో కొత్తగా స్టేషన్ టికెట్ బుకింగ్ సేవక్ (ఎస్‌టీబీఎస్)ల ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయించింది.
తాండూరు, న్యూస్‌లైన్: చిన్న రైల్వేస్టేషన్లలో కొత్తగా స్టేషన్ టికెట్ బుకింగ్ సేవక్ (ఎస్‌టీబీఎస్)ల ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయించింది. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు టికెట్ జారీ సేవలను మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఎస్‌టీబీఎస్‌లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానున్నది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రంగారెడ్డి జిల్లాలోని ఐదు చిన్న రైల్వేస్టేషన్‌లను ఎస్‌టీబీఎస్‌ల ఏర్పాటుకు రైల్వే శాఖ ఎంపిక చేసింది. గోధంగూడ, రుక్మాపూర్, ధారూరు, మంతట్టి, నవాంద్గీ రైల్వేస్టేషన్లను ఎస్‌టీబీఎస్‌ల ఏర్పాటుకు రైల్వే శాఖ ఎంపిక చేసింది.
ప్రస్తుతం చిన్న రైల్వేస్టేషన్లలో స్టేషన్ మాస్టర్లే టికెట్‌లను జారీ చేస్తున్నారు. రైళ్ల రాకపోకల సిగ్నల్స్ తదితర పనులతోపాటు టికెట్ల జారీ కూడా చేయూల్సి ఉండటంతో స్టేషన్ మాస్టర్లపై భారం పడుతోంది. పని ఒత్తిడిలో కొన్ని సందర్భాల్లో ప్రయాణికులకు టికెట్లు కూడా జారీ చేయలేని పరిస్థితి. రైళ్ల సంఖ్య కూడా పెరిగినందున చిన్న స్టేషన్లలో ఎస్‌టీబీఎస్‌లను ఏర్పాటు చేయడం ద్వారా టికెట్‌ల జారీ మరి ంత సులువుగా మారడంతోపాటు స్టేషన్ మాస్టర్లపై భారం తగ్గనుంది.
23లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఒక ఏడాది కాంట్రాక్ట్ పద్ధతిలో స్థానిక నిరుద్యోగ యువతకు ఎస్‌టీబీఎస్ బాధ్యతలు అప్పగిస్తారు. జారీ అయ్యే టికెట్లపై వచ్చే ఆదాయంపై 4శాతం కమీషన్‌ను ఎస్‌టీబీఎస్‌లకు రైల్వే శాఖ చెల్లించనున్నది. టికెట్ డబ్బులను ఎస్‌టీబీఎస్‌లు సంబంధిత స్టేషన్ మాస్టర్‌కు అప్పగించి, తరువా త ఎస్‌టీబీఎస్‌లు తమ సొంత పను లు కూడా చేసుకోవచ్చు. కనీసం పదో తరగతి విద్యార్హత కలిగి, 18- 35 ఏళ్ల వయసు ఉన్న స్థానిక నిరుద్యోగ యువత ఎస్‌టీబీఎస్‌లకు అర్హులు.
ఈనెల 23లోపు సికింద్రాబాద్‌లోని సీనియర్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కార్యాలయం(మొదటి అంతస్తు)లో ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాలని రైల్వే అధికారులు చెప్పారు. ఎస్‌టీబీఎస్‌లు ఏర్పాటు చేయనున్న రైల్వేస్టేషన్లు ఏ మండలం పరిధిలోకి వస్తాయో ఆ మండల తహసీల్దార్ జారీ చేసిన రెసిడెన్షియల్, కండక్ట్ సర్టిఫికెట్‌లను కూడా దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారు రూ.5వేల సెక్యూరిటీ డిపాజిట్, రూ.20వేలు బ్యాంకు గ్యారంటీ కింద చెల్లించాల్సి ఉంటుం దని రైల్వే అధికారులు తెలిపారు. ఈప్రక్రియ పూర్తయిన తరువాత ఆయా స్టేషన్‌లలో ఎస్‌టీబీఎస్ సేవ లు అందుబాటులోకి రానున్నాయి.