సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో అడుగులు ముందుకేస్తోంది. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన అనుకూల ఫలితాలు మరింత విశ్వాసాన్ని పెంచాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క చోట మినహా మిగిలిన ఆరు చోట్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
హుజూర్‌నగర్‌లో ఆ పార్టీ ఓడిపోయినా.. తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. అంతే కాకుండా.. ఎంపీ స్థానం పరిధిలో పార్టీ గెలిచిన ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు 1.07లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ మెజా రిటీని కాపాడుకోవడంతో పాటు, కోదాడ, హుజూర్‌నగర్ సెగ్మెంటలో ఈసారి ఓట్లశాతం పెరిగితే..కచ్చితంగా గెలుస్తామన్న ధీమాలో టీఆర్‌ఎస్ ఉంది.
విజయమే లక్ష్యంగా.. వ్యూహరచన
గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ఏకంగా 1,93,156 ఓట్ల ఆధిక్యం వచ్చింది. టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటి ఎన్నికల విషయానికి వస్తే.. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. తిరిగి ఆయనే ఈసారి పోటీ చేస్తారా? లేక కొత్త అభ్యర్థిని ఎవరినన్నా ప్రకటిస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది.
అదే మాదిరిగా గత ఎంపీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తేరా చిన్నపరెడ్డి టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన కూడా ప్రస్తుతం టికెట్ రేసులో ఉన్నారు. ఇక, రెండో స్థానంలో నిలిచి 2.79లక్షల ఓట్లు పొందిన టీడీపీ ప్రస్తుతం జిల్లాలో కనుమరుగయ్యే దుస్థితిలో ఉనికి కోసం పోరాడుతోంది. ఈసారి ఆ పార్టీ నుంచి ఎవరూ బరిలోకి దిగే అవకాశమే కనిపించడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ పోటీ చేయలేదు.
ఈ ఎంపీ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీచేసే అవకాశాలు దాదాపు లేవని భావిస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 2.60లక్షల ఓట్లు వచ్చాయి. అదే మాది రిగా.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆ ఎన్నికల్లో 39వేల ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఎన్నికల బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ నిలిచే అవకాశాలు కూడా కనిపించడం లేదు. నాటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.72లక్షల ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు సాధించిన గుత్తా, రెండో స్థానంలో నిలిచిన తేరా టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు పోలైన ఓట్లలో సగం ఓట్లు, తేరాకు పోలైన ఓట్లలో మెజారిటీ ఓట్లు, అదే మాదిరిగా, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు పోలైన ఓట్లు... ఇలా అన్నింటినీ కలిపి వీటిలో తమకు ఎన్ని ఓట్లు పోలయ్యే అవకాశం ఉందో లెక్కగడుతున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపు కోసం పక్కా వ్యూహం రచిస్తోంది.
సమన్వయం కోసం...!
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈలోగా.. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నా.. నల్లగొండ సమావేశాన్ని మాత్రం నిర్వహిస్తున్నారు. నల్లగొండపై ప్రత్యేక దృష్టి ఉన్నందునే ఈ సమావేశం జరగనుందని చెబుతున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆరు సెగ్మెంట్లు తమ చేతిలోనే ఉన్నా.. ఇప్పటి దాకా కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలవడం ద్వారా కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టాలన్న వ్యూహంతో సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు.
ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయడం ద్వారా ఎన్నికల్లో గెలుపు తమదే అన్న సంకేతం ముందుగానే పంపించాలన్న ప్రణాళికల్లో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఇప్పటికే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఏడు నియోజకవర్గాల నేతలతో మాట్లాడడంతో పాటు సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడికక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సమావేశాలు జరిపి సమీకరణపై దృష్టిపెట్టారు. వాస్తవానికి ప్రతి నియోజకవర్గం నుంచి రెండువేల మంది, సమావేశం జరుగుతున్న నల్లగొండ నుంచి మూడు వేల మంది వెరసి పదిహేను వేల మందితోనే సన్నాహక సమావేశం జరపాలని నిర్ణయించారు.
కానీ, అన్ని నియోజకవర్గాల నుంచి లక్ష్యానికి మంచి ఎక్కువ మందే హాజరు కానున్నారని పేర్కొంటున్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గం నుంచి పదివేల మందిదాకా వస్తున్నారని, అన్ని నియోజకవర్గాల నుంచి ఎంత మంది వస్తున్నారో అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment