సచివాలయంలో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశమైన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు సెలవు దినాలు, ఆదివారాల్లో తరగతులు నిర్వహించడానికి వీల్లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం కోచింగ్ ఇవ్వాలంటే ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో ఆయన భేటీ అయ్యారు.
కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు వచ్చే ఏడాదికి సంబంధించిన అడ్మిషన్లను ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు సమాచారం వచ్చిందని, ఆ ప్రక్రియను వెంటనే ఆపేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ప్రవేశాలకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేశాకే ప్రవేశాలు చేపట్టాలని, ఆలోపు ప్రవేశాలు చేపడితే ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు యాజమాన్యాలపై కేసులు పెడతామని హెచ్చరించారు. విద్యార్థులు జీవితాలతో చెలగాటమాడే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. కాలేజీలతోపాటు ఇకపై హాస్టళ్లకు కూడా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలు విచారకరం
ఇంటర్ సిలబస్‌ను సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల స్థాయికి తీసుకురావాలని, ఇంటర్‌లో ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలన్న సూచనలు తల్లిదండ్రుల నుంచి వచ్చాయని కడియం తెలిపారు. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేటు కాలేజీల్లో ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరమని, ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా నడుపుతున్న కాలేజీలు, హాస్టళ్లకు మొదటి దశలో నోటీసులు ఇచ్చామని, 15 రోజుల్లో వాటికి సమాధానాలు చెప్పాలన్నారు. యాజమాన్యాలు తమ సమస్యలను ఇంటర్ బోర్డుకు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరినందున త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కాలేజీల్లో వసతుల కల్పన, నిబంధనల అమలు, లోపాలు సరిదిద్దుకునేందుకు సమయం ఇస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని, అనుమతులు పొందిన కాలేజీల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామని తెలిపారు. అదనపు సెక్షన్లు, తరగతి గదులను ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు పీఆర్‌వో వ్యవస్థకు స్వస్తి పలకాలని, ప్రతి కాలేజీలో ఫిర్యాదుల పుస్తకం పెట్టాలని, విద్యార్థులు, తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
ఉదయం 9:30 నుంచి 4:30 వరకే
ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకే బోధన చేపట్టాలని, ఈ వేళలను కచ్చితంగా పాటించాల్సిందేనని కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్మీడియెట్ బోర్డు నోటీసులు జారీ చేసింది. సాయంత్రం వేళల్లో గేమ్స్, స్పోర్ట్స్ వంటివి కచ్చితంగా నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. మెడిటేషన్, యోగా వంటివి విద్యార్థులతో చేయించాలని పేర్కొంది. మహిళా కాలేజీల్లో మహిళా అధ్యాపకులనే నియమించాలని, బోర్డు విధించిన నిబంధనలను పాటించాలని చెప్పింది. మొత్తంగా 14 రకాల అంశాలపై యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment