ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్ : వీధికుక్కల వీరంగానికి ఓ ఆరేళ్ల చిన్నారి విలవిల్లాడింది. సకాలంలో తగిన వైద్యం అందక ఆరు గంటలపాటు నరకయాతన అనుభవించింది. పాపను బతికిం చుకునేందుకు పేదింటి తల్లిదండ్రులు ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరి గినా లాభం లేకపోయింది. ఆస్పత్రుల నిర్లక్ష్యం, ఉదాసీనత వల్ల చివరకు తుదిశ్వాస విడిచింది. ‘అమ్మానాన్న.. భయమైతంది’అంటూతమ కుమార్తె పలికిన చివరి పలుకులు తలుచుకుంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కావడం అం దరినీ కలచివేసింది. హైదరాబాద్‌లో శనివారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.
అమ్మచేతి గోరుముద్ద తిని...
మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు కారంపూడి తండాకు చెందిన అంగోత్ హోలీ నాయక్ తన భార్య కవిత, కుమార్తె అంగోత్ బేబి, కుమారుడు గణేశ్‌లతో కలసి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి నగర శివార్లలోని చెంగిచెర్లలో ఉన్న సుశీల టౌన్‌షిప్‌లో నివాసముంటున్నాడు. రెండేళ్ల క్రితం వరకు దినసరి కూలీగా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లేవాడు. పది నెలల క్రితం నుంచి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారు ఉంటున్న కాలనీకి ఆనుకొని ఒకవైపు అడవి, మరోవైపు యాటల మండీ (జంతు వధశాల) ఉన్నాయి. రోజులాగే నాయక్ శని వారం ఆటో తీసుకొని బయటకు వెళ్లాడు. భార్య కవిత ఉద యం 10 గంటలకు కుమార్తె అం గోత్ బేబికి గోరుముద్దలు తినిపించింది. ఆ తర్వాత బట్టలు ఉతుకుతుండగా అమూల్తా వచ్చి అమ్మా టాయ్‌లెట్ వస్తోందని చెప్పడంతో బాత్‌రూమ్‌కు వెళ్లమని చెప్పింది.
అయితే అంగోత్ బేబి ఇంటి ముందు ఉన్న రోడ్డుపైకి వెళ్లడాన్ని తల్లి గమనించలేదు. అదే సమయంలో ఒక్కసారిగా వచ్చిన ఐదు వీధికుక్కలు పాపపై దాడి చేశాయి. నిస్సహాయంగా ఉన్న ఆ పాపను ఒళ్లంతా పట్టి పీకాయి. ఇంటి బయట కుక్కల అరుపులు, కుమార్తె ఆర్తనాదాలు వినిపించడంతో బయటకు వెళ్లి తల్లి చూడగా అంగోత్ బేబిని కుక్కలు పట్టుకొని ఇంకా కరుస్తుండటం చూసింది. వెంటనే అక్కడున్న కర్రలు, రాళ్లతో కుక్కలను చెదరగొట్టిన కవిత... భర్తకు విషయం తెలపడంతోపాటు అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అప్పటికే పాప శరీరమంతా రక్తసిక్తమైంది.
ఆరు గంటలపాటు తల్లడిల్లి...
శనివారం ఉదయం 10.30 గంటలకు కుక్కలు దాడి చేయగా 11.00 గంటల సమయంలో తల్లిదండ్రులు అమూల్తాను ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి యాజమాన్యం ఫీజు వసూలు చేసి రెండు గంటలపాటు చికిత్స చేసింది. ఆ తర్వాత తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. సమీపంలోని అంకుర ఆస్పత్రికి తరలించాలని చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో చేసేది లేక మరో అంబులెన్సులో తల్లిదండ్రులు తమ చిన్నారిని ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపను దాదాపు మూడు గంటలపాటు పరీక్షించిన వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో మరో అంబులెన్సులో సమీపంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులు ఆ చిన్నారికి చికిత్స చేయబోమని తెగేసి చెప్పడంతో ఫీవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు పరీక్షలు చేసే సమయంలో నీళ్లు తాగిన పాప తనకు భయంగా ఉందంటూ తల్లిదండ్రులతో చివరగా మాట్లాడింది. అయితే పరిస్థితి అప్పటికే విషమించడంతో పాపను నిలోఫర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సాయంత్రం 4:15 గంటలకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిలోఫర్‌లో దాదాపు గంటపాటు చికిత్స పొందిన అమూల్తా చివరకు కన్నుమూసింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తమ బిడ్డను ఎవరూ కాపాడలేకపోయారంటూ కన్నీరుమున్నీరయ్యారు. అమూల్తా అంటే తమకు ఎంతో ప్రాణమని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని ‘సాక్షి’తో మాట్లాడుతూ తల్లిడిల్లారు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం అంత్యక్రియల కోసం స్వస్థలానికి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment