మాట్లాడుతున్న కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్
ఎంజీఎం : ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ హెచ్చరించా రు. గురువారం కాకతీయ మెడికల్ కళాశాల మొదటి సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో వైద్య వృత్తి గొప్పదని, దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడని పేర్కొన్నారు.
అలాంటి వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రధానంగా ఇంజనీరింగ్ 33 శాతం, మెడికల్ కళాశాలల్లో 17 శాతం ర్యాగింగ్ జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ర్యాగింగ్ చట్టంపై పూర్తి స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి పడే శిక్షకాలాన్ని విద్యార్థులకు తెలిపారు. ఆయా విద్యాసంస్థల విభాగాధిపతులు ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోకపోతే వారు సైతం శిక్షార్హులేనన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని శిక్షించే క్రమంలో ఆయా విద్యా సంస్థల విభాగాధిపతులు అమలు చేసిన శిక్షను సుప్రీం కోర్టు సైతం మార్చలేదన్నారు. ర్యాగింగ్‌ను నిషేధించేలా కళాశాలలో తీసుకోవాల్సిన అంశాలను వివరించారు.
కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థులకు మెడికల్ కళాశాలలోని బోధన, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. కేఎంసీలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్, రాంకుమార్‌రెడ్డి, రజామాలీఖాన్, పీడీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment