
వ్యర్థాల విడుదలపై సీసీ కెమెరాలతో నిఘా
హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు.
♦ పీసీబీ అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్
♦ పోలీస్ శాఖ నుంచి పీసీబీకి 100 మంది అధికారులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశ్రామిక వ్యర్థాలను నాలాల్లోకి విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో శనివారం పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో సమీక్షించారు. అక్రమంగా వ్యర్థాల డంపింగ్ నిఘా కోసం టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో జీడిమెట్ల, బాలానగర్ పారిశ్రామికవాడల్లో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, త్వరలోనే ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామ న్నారు.
పరిశ్రమల వ్యర్థాల అక్రమ డంపింగ్‌ను అరికట్టేం దుకు టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే పోలీస్ శాఖ నుంచి 100 మంది అధికారు లను డిప్యూటేషన్‌పై నియమించుకో వాలని పీసీబీకి సూచించారు. ఈ మేరకు డిప్యుటేషన్ కోరుతూ ప్రతిపాదనలు పంపిస్తే హోం మంత్రి, డీజీపీలకు లేఖ రాస్తానని చెప్పారు. నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలు, విడుదలయ్యే వ్యర్థాల పరిమాణం, వ్యర్థాల రవాణాకు వినియోగిస్తున్న వాహనాలు తదితర వివరాలతో ఓ నివేదికను తయారు చేయాలని పీసీబీని కోరారు. కాలుష్యవ్యర్థాల నిర్వహణలో విఫలమవుతున్న శాఖలకు పీసీబీ నుంచి నోటీసులు జారీ చేయాలని కోరారు.
సంగారెడ్డి, పటాన్‌చెరు, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో కాలుష్య వ్యర్థాలను బోరు గుంతల్లో విడుదల చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్‌తో మాట్లాడి ప్రత్యేక బృందాలతో తనిఖీలు జరిపి కేసులు నమోదు చేయాలన్నారు. ఈ తరహాలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పోలేపల్లి సెజ్‌లోని రెండు కంపెనీలను మూసివేస్తున్నామని పీసీబీ అధికారులు మంత్రికి తెలిపారు. ఈ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టి దర్యాప్తు జరపాలని మంత్రి ఆదేశించారు.
చెరువుల్లో నురగపై నివేదిక ఇవ్వండి
చెరువుల నుంచి వస్తున్న నురగపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కేటీఆర్ కోరారు. పారిశ్రా మిక వ్యర్థాలపై కట్టడి లేకపోవడంతో ఈ సమస్య కొనసాగుతుందన్నారు. నగరంలోని చెరువులు, హుస్సే న్‌సాగర్ సుందరీకరణపై సమీక్షించారు. హుస్సేన్ సాగర్‌లోకి మురికి నీరు చేరకుండా 90% విజయం సాధించామన్నారు. వినాయక నిమజ్జనానికి 25 మినీ కొలనులను అభివృద్ధి చేశామన్నారు.