ఆందోళనకు దిగిన గ్రామస్తులు
దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థినిపై ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో శనివారం గ్రామస్తులు ఆశ్రమ పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగడంతో పాటు పంచాయతీ నిర్వహించారు. ఇందుకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. గౌరారం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రకరకాల ప్రలోభాలకు గురిచేస్తూ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
బాలికల పాఠశాలలో పురుష ఉపాధ్యాయులు ఉండటంతోనే ఇటువంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత పది రోజుల క్రితం బాలిక మేడారం జాతరకు వెళుతుండగా మార్గమధ్యలో ఆ ఉపాధ్యాయుడు మోటారుసైకిల్‌పై ఎక్కించుకుని పెదనల్లబల్లి అడ్డ రోడ్డు వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం మూడు రోజుల క్రితం బయటకు పొక్కింది.
దీంతో గ్రామస్తులు స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్‌కి వివరాలు సేకరించి హెచ్ ఎం రమేష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు మల్లేశ్వరరావు, జుంకిలాల్‌లను హెచ్‌ఎం శుక్రవారం సాయంత్రం తీవ్రంగా మందలించి అటువంటి చర్యలకు పాల్పడితే సరిదిద్దుకోవాలని మరోసారి ఇటువంటి ఆరోపణలు వసే ్త ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు.
గ్రామ పెద్దలు అక్కడికి చేరుకొని పంచాయతీ నిర్వహించారు. అయితే పదో తరగతి బాలికలను సందేహాల నివృత్తి పేరుతో వారి గదులకు పిలిపించుకొని వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. సమాచారం సేకరించేందుకు వెళ్లిన విలేకరులను పంచాయతీ జరిగే సమయంలో అక్కడ ఉండవద్దని గ్రామస్తులు కోరారు. కాగా పాఠశాలకు చెందిన వర్కర్లు ఉపాధ్యాయుల మెప్పు పొందేందుకు బాలికలను లైంగిక దాడులకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏటీడబ్ల్యూఓ విచారణ
గౌరారం ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పరిణామాలపై ఏటీడబ్ల్యూ బాబూరావు శనివారం సాయంత్రం విచారణ చేపట్టారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకు ఆయన పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థినులను, ఉపాధ్యాయులతో వేరువేరుగా మాట్లాడి సమాచారం సేకరించి ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు.
డీడీకి ఫిర్యాదు
ఈ విషయంపై గిరిజన సంఘాల నాయకుడు చలపతి, స్థానిక సర్పంచ్ రాముడు డీడీ అబ్రహంకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా వారు ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాలలో మహిళా టీచర్లను నియమించాలని కోరారు.తక్షణమే కీచక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఎటువంటి లైంగిక దాడులు జరగలేదు
గౌరారం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే వదంతులు నిరాధారమైనవి. కొందరు గిట్టని వారు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు.
-హెచ్‌ఎం రమేష్
నాకే పాపం తెలియదు
లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆరోపణలు అవాస్తవం. పదో తరగతి విద్యార్థిని గౌరారం నుంచి పెదనల్లబల్లికి వెళుతుండగా మార్గమధ్యలో కనబడితే వాహనంపై ఎక్కించుకొని పెదనల్లబల్లి అడ్డరోడ్డులో దించాను. లైంగి క వేధింపులకు నాకు ఎటువంటి సంబంధం లేదు.
- ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు
విద్యార్థినిపై లైంగిక వేధింపులు
Published Sun, Feb 28 2016 3:33 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement