'నేను ఎస్సైని... నన్నడిగేవాడెవడు'
వరంగల్: పదేళ్ల గా ఒక ఎస్సై ఒక బాలునిపై అమానుషంగా ప్రవర్తించాడు. అతన్ని కరడుగట్టిన నేరస్థుడితో సమానంగా చూశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. జిల్లాలోని తొర్రూరు మండలం, అమ్మాపురం గ్రామానికి చెందిన గంధం వీరన్న(10) వర్ధన్నపేటలోని చిన్నారుల సంక్షేమ వసతిగృహంలో ఉంటూ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అయితే, వసతిగృహం పక్కనే ఉన్న ఓ డబ్బాకొట్టులో వీరన్న దొంగతనం చేశాడంటూ కొందరు ఆ బాలున్ని పోలీసులకు శనివారం సాయంత్రం అప్పగించారు. అప్పటి నుంచీ వీరన్నను ఎస్‌ఐ కృష్ణకుమార్ పోలీస్ స్టేషన్‌లో ఉంచాడు. బాలున్ని స్టేషన్‌లో ఓ మొద్దుకు కట్టేసి ఉండడాన్ని చూసిన కొందరు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మీడియాకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ బాలున్ని వదిలేశాడు. అయితే, ఎస్‌ఐ తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(వర్ధన్నపేట)