సబ్సిడీ కిరోసిన్‌ ఎత్తివేత!     | Subsidy kerosene to be canceled | Sakshi
Sakshi News home page

సబ్సిడీ కిరోసిన్‌ ఎత్తివేత!    

Published Fri, Feb 22 2019 1:10 AM | Last Updated on Fri, Feb 22 2019 1:10 AM

Subsidy kerosene to be canceled - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని పేదలకు చేరాల్సిన రాయితీ కిరోసిన్‌ పక్కదారి పడుతోంది. రేషన్‌ డీలర్ల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం వెరసి కిరోసిన్‌ యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతోంది. కిరోసిన్‌ దందాపై నిఘా కొరవడటంతో వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నట్లు ఇటీవలి పౌరసరఫరాల శాఖ విశ్లేషణలో తేలింది. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కిరోసిన్‌ సరఫరానే పూర్తిగా నిలిపివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.  

ఎత్తివేతకు కేంద్రం మొగ్గు.. 
అయితే రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఇ –పాస్‌) విధానాన్ని కిరోసిన్‌ పంపిణీకి కూడా అనుసంధానం చేశారు. ఇటీవలే ఈ విధానం అమల్లోకి రావడంతో డీలర్లు కిరోసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వీలు లేకుండా అడ్డుకట్ట పడుతోంది. ఈ నెలలోనే ప్రస్తుత లెక్కల మేరకే 33 శాతం మేర కిరోసిన్‌ మిగులు సాధించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇ–పాస్‌ విధానం అన్ని రాష్ట్రాల్లో అమల్లో లేదు. దీంతో దేశవ్యాప్తంగా కిరోసిన్‌ అక్రమాలకు చెక్‌పడటం లేదు. దేశవ్యాప్తంగా 41శాతం ఏటా అక్రమమా ర్గం పడుతోందని కేంద్రం తన సర్వేలో గుర్తించింది. ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నూటికి 95 శాతం మంది దీపం, వంట పొయ్యి లు వాడడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరికీ గ్యాస్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాయితీ సరఫరాను పూర్తిగా నిలిపివేయా లని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక సలహాదారు సైతం ప్రభుత్వానికి తమ సిఫారసులు పంపినట్లుగా తెలిసింది.  

రాయితీ కిరోసిన్‌ అంతా పెట్రోల్‌ బంక్‌లకే.. 
రాష్ట్రంలో ప్రస్తుతం 87లక్షల రేషన్‌ కార్డులుండగా, 2.79 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో కార్డుపై నెలకు లీటర్‌ కిరోసిన్‌ని రూ.29కి సరఫరా చేస్తున్నారు. నిజానికి లీటర్‌ కిరోసిన్‌ ధర రూ.40మేర ఉండగా, రూ.11 మేర కేంద్ర ప్రభుత్వం రాయితీని భరిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెలా సరాసరిన 7.60 లక్షల లీటర్ల కిరోసిన్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. అయితే ఈ కిరోసిన్‌ని రేషన్‌ డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలా హోల్‌సేల్‌ డీలర్లు, రేషన్‌ డీలర్లకు సరఫరా చేయాల్సి ఉండగా, ఒక నెల సరఫరా చేసి మరో నెల తప్పిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులకు సరైన సమాచారం లేకపోవడంతో డీలర్ల వద్దే కిరోసిన్‌ మిగిలిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు కిరోసిన్‌ను పెట్రోల్‌ బంక్‌లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌ ధరలు పైకి ఎగబాకడం డీలర్లకు కాసులు కురిపిస్తోంది. రూ.29కే అందుతున్న కిరోసిన్‌ని ఏకంగా డీలర్లు రూ.40 నుంచి రూ.50కి పెట్రోల్‌ బంక్‌ యజమానులకు విక్రయిస్తున్నారు. ఇటీవలే రాయితీ కిరోసిన్‌తో చేస్తున్న కొత్తదందాను తెలంగాణ విజిలెన్స్‌ గుర్తించింది. ‘ఇంటెరాక్స్‌ ఎస్టీ 50’అనే కెమికల్‌తో పాటు ముల్తానా మట్టిని వినియోగించి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్చేస్తున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ ఇంధనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేసి, వివిధ పెట్రోల్‌ బంకులకు విక్రయిస్తున్నారు. ఏటా రూ.100 కోట్ల మేర సాగుతున్న ఈ అక్రమ వ్యవహారం తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల చొరవతో గత నెలలో బహిర్గతమైంది. ప్రతి ఏటా ఈ విధంగా ఏకంగా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్‌ బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement