చేదును పంచుతున్న చెరుకు | Sugarcane Farmers Crop Loss Medak | Sakshi
Sakshi News home page

చేదును పంచుతున్న చెరుకు

Published Mon, Dec 24 2018 11:07 AM | Last Updated on Mon, Dec 24 2018 11:07 AM

Sugarcane Farmers Crop Loss Medak - Sakshi

మెదక్‌జోన్‌: ఒకప్పుడు వేలాది ఎకరాల్లో చెరుకు పండించే మెతుకుసీమలో నేడు ఆ సంఖ్య భారీగా తగ్గింది. మూడు దశాబ్ధాల్లో జిల్లాలో చెరుకు సాగు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. నాడు చెరుకు సాగుతో ఆర్థికంగా ఎంతో అభివృద్ది చెందిన రైతులు నేడు పంట సాగు లేక విలవిలలాడుతున్నారు. దీనికి కారణం ఎన్డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీ మూతపడటమే . జిల్లాలోని మంబోజిపల్లి శివారులో 1987 సంవత్సరంలో నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నిర్మించారు. నాటి నుంచి ఉమ్మడి  జిల్లాలోని 12 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీ ఆధారంగా  సుమారు 20 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగుచేసేవారు. దీంతో 4 లక్షల మెట్రిక్‌టన్నుల చెరుకును గానుగాడించేవారు. రైతులకు ప్రతియేటా కోట్లాది రూపాయలను పంచేవారు.

 అప్పట్లో ఆ ప్యాక్టరీలో పర్మినెంట్‌ కార్మికులు 300 మంది ఉండగా సీజనల్‌ వర్కర్లు మరో 300 మంది నిత్యం పనులు చేసేవారు.   రైతులకు,  కార్మికులకు కొండంత అండగా ఉన్న ఈ ఫ్యాక్టరీని 2003 సంవత్సరంలో  చంద్రబాబునాయుడు హయాంలో ఈ ఫ్యాక్టరీని కేవలం రూ. 60 కోట్లకు మెదక్, బోధన్, చక్కర్‌నగర్లో ఉండే మూడు నిజాంషుగర్‌ ఫ్యాక్టరీలను 51శాతం వాటను నిజాందక్కన్‌ పేపర్‌మిల్లు యజమానికి విక్రయించాడు.  ఇదిప్రైవేట్‌పరం అయిన నుంచి కార్మికులకు, రైతులకు యజమాని చుక్కలు చూపించాడు.  ఎంతోమంది కార్మికులకు బలవంతంగా వీఆర్‌ఏలు ఇచ్చి గెంటివేశాడు. ప్యాక్టరీని 2014లో అక్రమంగా లాకవుట్‌ ప్రకటించి కార్మికులను రోడ్డుపాలుజేశారు. దీంతో   నాటివైభవం పూర్తిగా కనుమరుగైంది.

ఫ్యాక్టరీ మూతతో సాగు కనుమరుగు 
ఒకనాడు ఎన్‌డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీ నడుస్తున్న క్రమంలో  ఫ్యాక్టరీ పరిధిలోని వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, టేక్మాల్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, మెదక్, చిన్నశంకరంపేట, చేగుంట, రామాయంపేట తదితర   ఉమ్మడి జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఏటా 20 వేల ఎకరాల చెరుకు పంటను సాగుచేసేవారు. అది పూర్తిగా మూతపడటంతో ప్రస్తుతం జిల్లాలో కేవలం 800 ఎకరాల్లో మాత్రమే చెరుకు పంట సాగవుతోంది.  పండించిన కొద్దిపాటి చెరుకును  మెదక్‌  నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలోని ఫ్యాక్టరీలకు చెరుకును తరలిస్తున్నారు. కాగా వచ్చేలాభం రవాణా ఖర్చులకే పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అతికొద్ది మంది రైతులు మాత్రం బెల్లం తయారు చేస్తున్నారు.
 
తక్కువనీటితో సాగు
చెరుకు సాగుకు అతి తక్కువ నీరు ఉన్నా పండుతుంది.  ఎకర వరిపంటకు ఉపయోగించే నీటితో 6 ఎకరాల్లో చెరుకు పంటను  పండించవచ్చును. అంతేకాకుండా ఒక్క ఏడాది చెరుకును నాటితో ఇది మూడు సంవత్సరాలవరకు పెరుగుతూనే ఉంటోంది. దీంతో విత్తనం ఖర్చులు రైతుకు పూర్తిగా తగ్గిపోతాయి.  వరుస కరువుకాటకాలతో బోరుబావుల్లో నీటిఊటలు గణనీయంగా తగ్గిపోతున్న క్రమంలో కొద్దిపాటిగా వచ్చే నీటితోనూ చెరుకు పంటను సాగుచేసేందుకు వీలు ఉంటుంది. కానీ పంటను సాగుచేస్తె ఇతర జిల్లాలకు తరలించేందుకు రవాణా ఖర్చులు అధిక మొత్తంలో అవుతాయని వచ్చేఆదాయం రవాణా ఖర్చులకే పోతాయనే ఉద్దేశంలో చెరుకు పంటను సాగుచేయడం లేదు. ఇకనైనా పాలకులు స్పందించి ప్యాక్టరీని తెరిపిస్తే ఈప్రాంతంలో చెరుకు సాగుకు పూర్వవైభవం రావటం ఖాయం

ఇచ్చిన హామీని మరిచారు 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే రైతులకోసం ప్రత్యేకంగా పలు పథకాలను అమలు చేస్తూ అన్నదాతల అభివృద్ధి కోసం తోడ్పాటును అందిస్తోంది. కానీ 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎన్‌డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో ఎవరికి అర్థంకాని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాగోగుల దృష్ట్యా ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తే ఈ ప్రాంత చెరుకు రైతుల జీవితాల్లో తీపిని నింపినట్లు అవుతుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement