
ఈ నెల 10న బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు 1,492 క్వింటాళ్ల టమాటా దిగుమతి అవగా బుధవారం అది వెయ్యి క్వింటాళ్లకు పడిపోయింది. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో నిత్యం3 వేల టన్నుల కూరగాయలు అవసరం.ఆఫ్ సీజన్‌తోపాటు కూరగాయల దిగుమతులు తగ్గడాన్ని దళారులు అనువుగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారు. కూరగాయల సాగు విస్తీర్ణం,
దిగుబడిలో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో ఉంది.
రాష్ట్రంలో వేసవి తీవ్రతతో ఉష్ణోగ్రతలు ఓవైపు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా మరోవైపు కూరగాయల ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. భూగ ర్భ జలాలు అడుగంటి కూరగాయల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి సైతం తగ్గిపోవడంతో వినియోగదారులపై ధరాభారం పెరుగుతోంది. ధరల పెరుగుదల జూలై దాకా కొనసాగే అవకాశముందని ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు అంచనా వేస్తున్నాయి.
తగ్గిన సాగు
రాష్ట్రంలో రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుండటం కూరగాయల సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేసవి తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో నష్టాల భయంతో రైతులు కూరగాయల సాగుకు దూరంగా ఉంటున్నారు. కూరగాయల సాగు సీజన్‌గా పేర్కొనే అక్టోబర్–ఫిబ్రవరి మధ్య రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగవుతాయని ఉద్యానవనశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కూరగాయల సాగులో ఆఫ్ సీజన్ కొనసాగుతుండటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.
కూరగాయలు ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు సాగుకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ సీజన్‌లో రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణంపై ఉద్యానవనశాఖ వాస్తవ గణాంకాలు సేకరిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ జంట నగరాల్లో వినియోగించే కూరగాయల్లో 60 శాతం వరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతు న్నాయి. ప్రజలు ఎక్కువగా వినియోగించే టమాటా, పచ్చి మిర్చి, బెండ, దొండ, బీర వంటి కూరగాయలు ఈసారి ఇతర ప్రాంతాల నుంచి కూడా దిగుమతి కాకపోవడం ధరల పెరుగుదలకు దారితీస్తోంది.
పొరుగు రాష్ట్రాలపైనే ఆధారం...
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే గతంలో నిత్యం 4 వేల పెట్టెల టమాటాలు హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చేవి. ప్రస్తుతం రోజూ వచ్చే దిగుమతులు 400 పెట్టెలకు మించకపోవడం తో హోల్‌సేల్ వ్యాపారులు పొరుగు రాష్ట్రాల వైపు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మద నపల్లి నుంచి కూడా టమాటా, పచ్చిమిర్చి దిగుమతి నిలిచి పోవడంతో మహారాష్ట్రలోని నాందేడ్, లాతూర్, కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంత రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా, బెల్గాం నుంచి పచ్చిమిర్చి, చిక్‌బళ్లాపూర్ నుంచి ఫ్రెంచ్ బీన్స్ రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి.
బోయినపల్లి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు ఈ నెల 10న 1,492 క్వింటాళ్ల టమాటా దిగుమతి అవగా బుధవారం కేవలం వేయి క్వింటాళ్లకు పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కాకర, క్యాప్సికం, దొండ, బెండ, వంకాయ, ఆకుకూరల దిగుమతుల్లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉందని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబున్నారు. ఓవైపు ఆఫ్ సీజన్‌తోపాటు కూరగాయల దిగుమతులు తగ్గడాన్ని దళారు లు అనువుగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వారం వ్యవధిలోనే కూరగాయ ల ధరలు బయటి మార్కెట్‌లో కిలోకు సగటున రూ. 5 నుంచి రూ. 20 వరకు పెరిగాయి.
సాగు విస్తీర్ణం పెంచేందుకు క్రాప్ కాలనీలు..
రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి రోజుకు సగటున 300 నుంచి 400 గ్రాముల కూరగాయలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ లెక్కన కేవలం హైదరాబాద్ జంట నగరాల పరిధిలో నిత్యం 3 వేల టన్నుల కూరగాయలు అవసరం. రాష్ట్రంలో ఎక్కువగా టమాటా, పచ్చిమిర్చి, దుంపలు, ఆకుకూరలు, ఫ్రెంచ్ బీన్స్‌ను వినియోగిస్తారు. కూరగాయల సాగు విస్తీర్ణం, దిగుబడిలో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఇప్పటికే క్రాప్ కాలనీల పేరిట రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ క్రాప్ కాలనీలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల వ్యవధిలో రూ. 985 కోట్లు అవసరమవుతాయని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది.
టమాటా సాగుతో నష్టపోయా...
మూడు నెలలపాటు దిగుబడి ఇచ్చే టమాటాను ఎకరా విస్తీర్ణంలో సాగు చేసేందుకు రూ. 15 వేల వరకు వెచ్చించా. మొదట్లో బోరుబావిలో నీరున్నా దిగుబడి వచ్చే సమయంలో అడుగంటడంతో తోట ఎండిపోయింది. 400 పెట్టెల దిగుబడి వస్తుందని ఆశించినా 15 పెట్టెలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో పెట్టె టమాటా ధర రూ. 100 ఉండగా ప్రస్తుతం రూ. 400 నుంచి రూ. 500 వరకు పలుకుతోంది. పెట్టుబడితో కలుపుకొని మొత్తంగా రూ. లక్షన్నరపైనే నష్టపోయా.
– ఫయాజ్, రైతు, కుప్పానగర్, సంగారెడ్డి జిల్లా

Comments
Please login to add a commentAdd a comment