
సాక్షి, యాలాల: జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి మంగళవారం నుంచి.. మంత్రి మహేందర్‌రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. 20 రోజుల పాటు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న యాలాల నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా మొదటి రోజు రాస్నం, ముద్దాయిపేట్, దేవనూర్, గోరేపల్లి, తిమ్మాయిపల్లి, బండమీదిపల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. మొదటి విడత పర్యటన పూర్తయిన తర్వాత డ్వాక్రా మహిళలతో మండల స్థాయి బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మార్నింగ్ వాక్‌లతో గిరిజన తండాలను సందర్శిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. తన పర్యటనల్లో భాగంగా వివిధ పార్టీల నుంచి బలమైన నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించనున్నారని పార్టీ నాయకుడొకరు తెలిపారు.