సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి దాఖలైన అప్పీలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రాజెక్టు ప్రారంభమైన ఏడేళ్ల తర్వాత కేసు వేయడం, ఫిర్యాదు చేయాల్సిన పరిధి దాటి మరోచోట పిటిషన్ వేయడం ఏమిటని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రాజెక్టు పనులు కొనసాగించుకోవచ్చంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ నవీన్‌సిన్హాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది.
ఎన్జీటీ నుంచి హైకోర్టుకు.. సుప్రీంకోర్టుకు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు లేకుండా అటవీ భూములను వినియోగిస్తున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన హయాతుద్దీన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రధాన ధర్మాసనంలో ఫిర్యాదు చేశారు. దాంతో ఎన్జీటీ గతేడాది అక్టోబర్ 5న ప్రాజెక్టు పనులపై స్టే విధించింది. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా.. ఎన్జీటీ స్టేను రద్దు చేసి, పనులు కొనసాగించకోవచ్చంటూ నవంబర్ 8న ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి పనులు ప్రారంభమైన ఆరు నెలల్లోపు దాఖలైన పిటిషన్లను మాత్రమే విచారించాలని ఎన్జీటీ చట్టం సెక్షన్ 14(3) చెబుతోందని, కానీ ఎన్జీటీ ఆ సెక్షన్‌ను పరిశీలించకుండానే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక దక్షిణాది రాష్ట్రాల కోసం చెన్నైలో ఎన్జీటీ బెంచ్ ఉండగా ఢిల్లీలోని ప్రధాన బెంచ్ ముందు నేరుగా పిటిషన్ దాఖలు చేయడం ఏమిటని.. అసలు ఈ పిటిషన్‌ను విచారించే న్యాయపరిధి ప్రధాన బెంచ్‌కు ఉందా, లేదా అన్నది కూడా తేల్చాల్సి ఉందని అభిప్రాయపడింది. అయితే పర్యావరణ అనుమతులు వచ్చేవరకు కాలువలు, పిల్ల కాలువల నిర్మాణాలు, ఇతర అనుబంధ పనులను మాత్రం చేయవద్దని.. అటవీ అనుమతులు వచ్చేవరకు అటవీ భూములను తాకరాదని ఆదేశించింది. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవచ్చని ఎన్జీటీకి స్పష్టం చేసింది. అయితే ఎన్జీటీ ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేయడంపై పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇది ‘ఫోరం హంటింగ్’కాదా?
ఈ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ సవాలు చేసిన అనుమతులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నాయని, కేవలం ప్రాజెక్టును అడ్డుకునేందుకే పిటిషన్ వేశారని పేర్కొన్నారు. అనంతరం పిటిషనర్ తరఫున న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారు. అందువల్లే ఎన్జీటీ స్టే ఇచ్చింది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం తాగునీటి ప్రాజెక్టుగా చెబుతూ వచ్చింది. కానీ సాగునీరు కూడా అందించే ప్రాజెక్టు ఇది. అటవీ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం అటవీ భూములను ఇతర అవసరాలకు వినియోగించినప్పుడు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది..’’అని ధర్మాసనానికి విన్నవించారు. దీంతో జస్టిస్ నారీమన్ జోక్యం చేసుకుంటూ.. ‘‘దక్షిణాది రాష్ట్రాలకు చెన్నైలో ఎన్జీటీ బెంచ్ ఉండగా.. ఢిల్లీ ఎన్జీటీకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది ఫోరం హంటింగ్ (నిబంధనల ప్రకారం ఆశ్రయించాల్సిన బెంచ్‌ను కాకుండా.. నిర్దిష్ట బెంచ్ వినడం ద్వారా అనుకూలమైన ఉత్తర్వులు వస్తాయని భావించి ఇతర న్యాయస్థానాలను, ధర్మాసనాలను ఆశ్రయించడం) చేస్తున్నట్టు కాదా..?’’అని వ్యాఖ్యానించారు.
దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. ఈ కేసు కేవలం తెలంగాణ వరకే పరిమితం కాదని, మహారాష్ట్రతో కూడా ముడిపడి ఉందని చెప్పారు. అలాగే తాము పిటిషన్ దాఖలు చేసిన సమయంలో చెన్నై బెంచ్ ఖాళీగా ఉందని, ఢిల్లీలోని ప్రధాన బెంచ్‌లో కూడా ఒక న్యాయమూర్తి, ఒక ఎక్స్‌పర్ట్ మెంబర్ మాత్రమే ఉన్నారని... పూర్తి బెంచ్ లేదన్న కారణంగానే ఎన్జీటీ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిందని వివరించారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ.. అసలు ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాక ఏడేళ్లకు ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తరచూ పిటిషన్లు వేస్తున్నారని, దానిని నివారించేందుకు పిటిషనర్‌కు జరిమానా విధించాలని న్యాయవాది ముకుల్ రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించలేదు.
కోర్టుహాల్‌లో మంత్రి హరీశ్‌రావు
శుక్రవారం మంత్రి హరీశ్‌రావు స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. గురువారం సాయంత్రమే ఢిల్లీ వచ్చిన ఆయన.. న్యాయవాదుల బృందంతో చర్చించారు. విచారణ అనంతరం పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో న్యాయవాదులను హరీశ్‌రావు అభినందించారు. కోర్టు ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఫోన్‌లో వివరించారు. ఈ సందర్భంలో న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. ‘నేను చాలా మంది మంత్రులను చూశాను. కానీ మీలాంటి ప్రతిభ కల మంత్రిని చూడలేదు..’అని ప్రశంసించారు. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు కూడా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment