శనివారం మఖ్దూంభవన్‌లో నిరవధిక దీక్ష చేస్తున్న కూనంనేని
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రైవేటీకరించి, వేల కోట్ల విలువ చేసే ఆ సంస్థ ఆస్తుల్ని సీఎం కేసీఆర్ తన అనుయాయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి ఆరోపించారు. సీఎం తన వైఖరిని మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికులకు న్యాయం జరిగేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం మఖ్దూంభవన్‌లో సీపీఐ సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేపట్టిన నిరవధిక దీక్షను సురవరం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ..సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నానికి, బెదిరింపులకు దిగుతోందని ధ్వజమెత్తారు. దీక్షలో ఉన్న కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..ఉద్యమనేతగా ఉన్న వ్యక్తి సీఎం అయ్యాక కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. సమ్మె పరిష్కారమయ్యే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment