
ఫీల్డ్ అసిస్టెంట్‌లపై వేటు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : జిల్లాలోని ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్‌లపై వేటు పడింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాంలో నిర్లక్ష్యం చేసి, పురోగతి సాధించనందుకు గాను వారిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ యోగితా రాణా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ)ను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పక్షం రోజులలో నిర్దేశించిన లక్ష్యం సాధించని వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 15 రోజుల్లో మొత్తం 5,160 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేయగా నవీపేట్ మండలంలోని నందిగామ, కోస్లి, అబంగపట్నం, యంచ గ్రామాల్లో ఏ ఒక్క వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టలేదు.
దీంతో ఆ గ్రామాల్లో పని చేస్తున్న ఫీల్డ్ అ సిస్టెంట్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నా రు. అదే విధంగా డిచ్‌పల్లి మండలం నడ్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌ను కూడా సస్పెండ్ చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ రాజ్, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.