
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు.
బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్ గృహ నిర్బంధంలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ తరలించారు. అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించొద్దని.. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు సందర్భాల్లో ఇతర మతాలపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వామి పరిపూర్ణాంద తరలింపులో తొలుత పోలీసులు చాకచక్యం ప్రదర్శించారు. నాలుగు వాహనాల్లో బయలు దేరిన పోలీసులు రెండు వాహనాలను విజయవాడ వైపు, మరో రెండు వాహనాలను శ్రీశైలం వైపు పంపించారు. ఈ రెండు మార్గాల్లో ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయాన్నిపోలీసులు వెల్లడించలేదు. అధికారిక ప్రకటన అనంతరం కాకినాడలోని శ్రీపీఠానికి స్వామి పరిపూర్ణానందను తరలించినట్లు పోలీసులు తెలిపారు.