పథకం ప్రకారమే ఎడపల్లి సిండికేట్ బ్యాంకులోఅక్రమార్కులు రెండున్నర కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది. బోగస్ పట్టాలు, నకిలీ వన్‌బీ, పహాణీలతో రైతుల పేరిట ఖాతాలు తీసి పంట రుణాలను మంజూరు చేసి లేపుకున్నారు. ఈ రుణాలను రుణమాఫీ కింద మాఫీ చేయించి తప్పించుకుందామని స్కెచ్ వేశారు. అయితే పథకం వికటించి అక్కమార్కుల గుట్టు రట్టయ్యింది.
సాక్షి, నిజామాబాద్ : పంట రుణాల కుంభణంకోలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంక్‌లో బోగస్ పట్టాలు, నకిలీ వన్‌బీ, పహాణీలతో సుమారు రూ.2.5 కోట్ల వరకు అక్రమార్కులు పంట రుణాల పేరిట లూటీ చేసిన విషయం విధితమే ! ఈ రుణాలను ప్రభుత్వ రుణమాఫీ పథకంలో మాఫీ చేయించి, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని ముగించేసేలా పక్కా ప్రణాళికతో అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణ తేలింది. రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం కాస్త జాప్యం జరిగింది. ఈలోగా ఈ బాగోతం వెలుగులోకి రావడంతో బ్యాంకు ఉన్నతాధికారులతో పాటు, బాధితులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లీడ్ బ్యాంకు ఉన్నతాధికారులు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకానికి అర్హులైన రైతుల జాబితాను ఆయా బ్యాంకుల బ్రాంచీల ద్వారా సేకరించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇలా తయారు చేసిన జాబితాలో ఈ బోగస్ పంటరుణాలను కూడా చేర్చేసి, చేతికి మట్టి అంటకుండా నిధులు కాజేయాలనే పక్కా ప్రణాళికతో వ్యవహారం నడిపినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
అప్రమత్తమైన రెవెన్యూ శాఖ..
సిండికేట్‌బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో రెవెన్యూశాఖ అప్రమత్తమైంది. నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, నకిలీ పహాణీలు, వన్‌బీలు తెరపైకి రావడంతో రెవెన్యూ అధికారులు కుంభకోణంపై దృష్టి సారించారు. ఇలా పంటరుణాలు పొందిన రైతుల పేర్లు, పాసుపుస్తకాలు, పహాణీలు, 1బీ రికార్డులు తమకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఇందుకు బ్యాంకు ఉన్నతాధికారులు అంగీకరించకపోవడంతో స్థానిక తహశీల్దార్ అశోక్ కుమార్ వివరాల కోసం లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ కూడా ఈ వ్యవహారాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా కుంభకోణంపై ఆరా తీస్తున్నారు. ఇంకా లిఖిత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో ముందస్తుగా వివరాలను సేకరిస్తున్నారు.
దళారుల ముఠాగా మారి..
బ్యాంకు ఉన్నతాధికారులు, ఆయా గ్రామాల్లో ఉన్న దళారులు చేతులు కలిపి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గ్రామాల్లో అమాయకులకు కాస్త డబ్బులను ఆశగా చూపి, వారి ఆధార్ కార్డులను సేకరించి వారితో ఖాతాలను తెరిపించారు. ఖాతాదారులకు భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించి రుణం మంజూరు చేశారు. ఈ రుణాన్ని సదరు బినామీ ఖాతాల్లోకి మళ్లించి ఆ ఖాతానుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇలా ఏకంగా రూ.కోట్లలో బ్యాంకును లూటీ చేయడం జిల్లాలో చర్చనీయాశంగా మారింది.
అంతర్గత విచారణ కొనసాగుతోంది : రేణుక, రీజినల్ మేనేజర్..
పంట రుణాల మంజూరులో జరిగిన లోపాలపై అంతర్గత విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యే వరకు వివరాలు బయటకు చెప్పడం కుదరదు. ఈ విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాము.
Comments
Please login to add a commentAdd a comment