కేసు నమోదుకు సైబరాబాద్ పోలీసుల కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఇటీవల స్టడీటూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మృత్యువాత పడినట్లే.. రెండేళ్ల క్రితం (2012లో) స్టడీటూర్ సందర్భంలోనూ అదే కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పులిచింతల ప్రాజెక్టులో నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే యాజమాన్య నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసుంటే ఇప్పుడీ 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేదికాదని భావించిన ‘పులిచింతల’ ఘటన బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. 2012లో 53 మంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం స్టడీ టూర్‌కు తీసుకెళ్లింది. వారిలో అజయ్, మోహన్‌కుమార్ విద్యార్థులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో తగిన సహాయం అందిస్తామని అప్పట్లో కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు.
అయితే తర్వాత వారు తరబడి తిరిగినా చిల్లిగవ్వ కాదు కదా కనీసం మృతుడి సోదరికి కళాశాలలో సీటు కూడా యాజమాన్యం ఇవ్వలేదు. ఇదిలాఉండగా, ఈ నెల 3న అదే కళాశాలకు చెందిన 52 మంది విద్యార్థులు స్టడీ టూర్ కోసం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లారు. వారిలో 24 మంది బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అజయ్, మోహన్‌కుమార్‌ల తండ్రులు కె.ప్రహ్లాదరావు, ఈశ్వరరావు స్పందించారు. మంగళవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పులిచింతల ఘటనలో విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలపై కేసు నమోదు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
‘విజ్ఞానజ్యోతి’ పై చర్య తీసుకోండి
Published Wed, Jun 18 2014 3:00 AM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM
Advertisement
Advertisement