ఆయా శాఖలకు గవర్నర్ సలహాదారు రాయ్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: పేదలకు అందాల్సిన ఉపకారాలను కాజేస్తున్న ఉద్యోగులు, అధికారులపై గవర్నర్ సలహాదారు ఎఎన్. రాయ్ చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జూన్ 1తో ఆయన అధికారాలు ముగుస్తున్న నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను కాజేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోనున్నారు.
అవినీతి నిరోధక శాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికితీసింది. దానికి బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నివేదిక సమర్పించింది. అయినా ఇప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలను తీసుకోలేదని రాయ్ గుర్తించి... హాస్టళ్లలో అక్రమాలపై తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాల్సిందిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శులకు గురువారం ప్రత్యేకంగా నోట్ పంపించారు.