మెజారిటీ పదవులే లక్ష్యం! | target for mejority posts! | Sakshi
Sakshi News home page

మెజారిటీ పదవులే లక్ష్యం!

Published Tue, Jul 1 2014 12:43 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM

మెజారిటీ పదవులే లక్ష్యం! - Sakshi

మెజారిటీ పదవులే లక్ష్యం!

స్థానికంగా టీఆర్‌ఎస్ పాచికలు
- ఇతర పార్టీల్లోని సభ్యులపై వల
- జోరుగా ప్రలోభాల పర్వం
- నేడు మంత్రి హరీష్‌రావు రాక
- రెండు రోజుల పాటు జిల్లాలోనే మకాం
- అజ్ఞాతంలోకి కాంగ్రెస్, టీడీపీ సభ్యులు
- విప్‌తో ఎదుర్కొనేందుకు సన్నద్ధం

 సంగారెడ్డి డివిజన్: స్థానిక సంస్థల పదవులే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీ, ఎంపీపీ పదవులు దక్కించుకునేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. మెజార్టీలేని చోట సైతం చైర్మన్ , అధ్యక్ష పదవులను కైవసం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. కాగా మంత్రి హరీష్‌రావు మంగళవారం జిల్లాకు రానున్నారు. అవసరమైన వ్యూహరచన చేసేందుకు రెండు రోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నట్టు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్, టీడీపీలు తమ పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలను కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. అలాగే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు విప్‌ను అస్త్రంగా మలుచుకునే ప్రయత్నాల్లో విపక్షాలు నిమగ్నమయ్యాయి. కాగా జూలై 3, 4, 5 తేదీల్లో వరుసగా మున్సిపల్, మండలపరిషత్ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే.
 
మున్సిపాలిటీల్లో పాగా!
గులాబీ పార్టీ ఎలాగైనా జిల్లాలోని అధిక మున్సిపాలిటీల్లో పాగా వేయాలని చూస్తోంది. మెదక్ మున్సిపాలిటీ మినహా జిల్లాలో ఎక్కడా టీఆర్‌ఎస్‌కు చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు అవసరమైన బలం లేదు. అయితే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి చెందిన కౌన్సిలర్లను తమవైపు తిప్పుకుని  పదవులను కైవసం చేసుకోవాలని చూస్తోంది. సంగారెడ్డిలో ఎంఐఎం మద్దతు తీసుకోవటంతోపాటు కాంగ్రెస్ నుంచి నలుగురు కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది.

సదాశివపేటలో సైతం కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్లను తమైవె పు తిప్పుకునేందుకు ప్రలోభాలను తెరలేపింది. జహీరాబాద్‌లో టీడీపీ, బీజేపీ, ఎంఐఎంతో జతకట్టి చైర్మన్ పదవి దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. అందోలులో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఇద్దరు నాయకులు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. దీంతో పార్టీలో విభేదాలు నెలకొన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని అసంతృప్త కౌన్సిలర్లను తమవైపు మరల్చుకుని చైర్మన్ పదవి దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. గజ్వేల్‌లో కాంగ్రెస్, టీడీపీ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరటంతో ఇక్కడ ఆ పార్టీకి చైర్మన్ పదకి దక్కే అవకాశం సులువైంది.
 
ఎంపీపీ పదవులపైనా కన్ను
మెజార్టీ ఎంపీపీ పదవులు దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పటాన్‌చెరులో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే గెలుపొందారు. అయితే ఇక్కడ ఇతర పార్టీలలోని ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. పెద్దశంకరంపేట మండలంలో ఆరుగురు టీడీపీ ఎంపీటీసీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకుని ఎంపీపీ పదవిని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది.

న్యాల్‌కల్ మండలంలో సైతం పదవి కోసం టీఆర్‌ఎస్ నాయకత్వం టీడీపీతో జతకట్టేందుకు సిద్ధమవుతోంది. కల్హేర్ మండలంలో ఎంపీపీ పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో టీఆర్‌ఎస్ మిలాఖత్ అవుతున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నియోజవకర్గంలోని ఆరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావటం.. స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ సీఎం కావటంతో ఆరు మండలాల్లోని కాంగ్రెస్, టీడీపీ ఎంపీటీసీలు చాలామంది టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో గజ్వేల్ నియోజకవర్గంలోని సొంత బలం లేనప్పటికీ అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్ ఎంపీపీ పదవులను దక్కించుకోనుంది.

రేగోడ్, నర్సాపూర్, సంగారెడ్డి, సదాశివపేటతోపాటు తమకు బలంలేని పలు మండలాల్లో ఎంపీపీ పదవులు కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. కాగా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అధికార పార్టీ వ్యూహాలను తిప్పికొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. విప్‌ను అస్త్రంగా మార్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

కాగా ఆదివారం హైదరాబాద్‌లో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో జరిగిన భేటీలో జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు విప్‌జారీపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి లేదా గీతారెడ్డికి విప్ జారీ చేసే అధికారం ఇచ్చే అవకాశాలున్నాయి. విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్ జెడ్పీటీసీలతోపాటు ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఎవరైనా అధికార పార్టీకి మద్దతిస్తే వారిపై వేటుపడేలా చూడాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement