వాషింగ్టన్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా గురువారం తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) నిర్వహించిన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. తాజాగా డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న ఆయనకు ప్రవాసీలు ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో భాగంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నతెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్ఆర్ఐలు శ్రీహరితో ముచ్చటించారు.
ముఖ్యంగా విద్య, జల వనరులు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ ఉత్పత్తి, శుభ్రమైన త్రాగునీరు, ఆరోగ్యం, శాంతి భద్రతలు, మరుగుదొడ్లు తదితర అంశాలకు సంబంధించి సూచనలను వారు శ్రీహరికి తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ, సోలార్ విద్యుత్ వంటి కార్యక్రమాల గురించి శ్రీహరి వారికి తెలియజేశారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో ఎన్ఆర్ఐలతో సమావేశమైనందుకు తనకు ఆనందంగా ఉందని కడియం తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అసలు డైనమిక్ లీడర్ కేసీఆర్ నేతృత్వంలో తాను పని చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని శ్రీహరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దామన్నారు.