Phone-in program
-
పచ్చనోటిస్తేనే పాస్ అవుతోంది
♦ జేసీ ఫోన్ఇన్లో బాధితుల ఫిర్యాదులు ♦ మూడు రోజులకు ఒకసారి ఫోన్ ఇన్ - జాయింట్ కలెక్టర్ ఒంగోలు టౌన్ : జిల్లాలో జరుగుతున్న మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంపై మూడు రోజులకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ వెల్లడించారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు వంటివి పారదర్శకంగా అందించేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా దళారీలను ఆశ్రయించకుండా నేరుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈనెల 10నుండి ప్రారంభమైన మీ ఇంటికి మీ భూమికి సంబంధించి ఇప్పటివరకు 14090అర్జీలు వచ్చాయని, అందులో 7213అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. 826అర్జీలను తిరస్కరించినట్లు తెలిపారు. ఆర్ఎస్ఆర్కు సంబంధించి 93గ్రామాల్లో 2లక్షల 90వేల రికార్డులను నమోదు చేశామని, మరో 4లక్షల రికార్డులను నమోదు చేయాల్సి ఉందని వివరించారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ ఏడీ నరసింహారావు, డీ సెక్షన్ సూపరింటెండ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరంపర... పచ్చనోటిస్తేనే పాస్ బుక్కులు పాసవుతున్నాయని, అవినీతి రాజ్యమేలుతోందని పలువురు బాధితులు జాయింట్ కలెక్టర్ హరి జవహర్లాల్ తన చాంబర్లో శుక్రవారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌కు ఫిర్యాదు చేశారు. టైటిల్ డీడ్ కోసం నాలుగు నెలల నుంచి దర్శి తహసీల్ధార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని దర్శి మండలం ముండ్లమూరుకు చెందిన అంబవరపు వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. టైటిల్ డీడ్ ఇప్పిస్తానంటూ వీఆర్ఓ ఆరువేల రూపాయలు తీసుకున్నా పని మాత్రం జరగలేదన్నారు. దీనికి జేసీ స్పందిస్తూ మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దర్శిలో ఉంటున్న తన అన్న తిరుపతిరెడ్డికి సర్వే నెం 3లో 2.70 ఎకరాల భూమి ఉందని, ఆయన ఇటీవల మరణించడంతో తన వదిన పేరున పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని తహసీల్ధార్‌ను కోరితే రూ.1500 డిమాండ్ చేశారని ప్రస్తావించగా వెంటనే తిరుపతిరెడ్డి భార్యకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని దర్శి తహసీల్ధార్‌ను ఆదేశించారు. ఇంకొల్లు తహసీల్ధార్ కార్యాలయంలో కరప్షన్ ఎక్కువైంది. ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారు. కరప్షన్‌ను అరికట్టాలని ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెంకు చెందిన రామకోటిరెడ్డి ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నారని, న్యాయం చేయాలని కోమటిగుంట కృష్ణ అనే వ్యక్తి వేడుకోగా వెంటనే సమస్యను పరిష్కరించాలని జేసీ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. పాస్ పుస్తకానికి ఏడాది నుంచీ తిప్పుకుంటున్నారని పొన్నలూరు మండలం వెలటూరు గ్రామానికి చెందిన కొండేటి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. పొన్నలూరు తహసీల్ధార్ కల్యాణ్‌తో జేసీ ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. తన భూమి వివరాలను మీ సేవలో చూసుకుంటే ఒక్క సెంట్ కూడా తన పేరు లేకుండా ఆక్రమించేశారని అర్ధవీడు మండలం కాకర్లకు చెంధిన పెరికె లక్ష్మణబాబు వాపోయాడు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. -
మీ తోడ్పాటు లేకుండా 'నో' మిషన్ కాకతీయ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మిషన్ కాకతీయకు ఎన్ఆర్ఐ తోడ్పాటు తప్పనిసరి అని నీటి పారుదలశాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. తమ ప్రభుత్వం ఈ విషయంలో ఎంతటి అంకిత భావంతో ముందుకు వెళుతుందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలకు వివరించారు. ఈ మిషన్ ద్వారా ప్రతి ఎకరా సాగుకు వచ్చి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కానుందని చెప్పారు. తెలంగాణ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (టీడీఎఫ్) నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో యూఎస్, యూకే, ఆస్ర్టేలియా, గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిలో దాదాపు 715 మంది తెలంగాణ ఎన్ఆర్ఐలతో మాట్లాడిన హరీష్ రావు... మిషన్ కాకతీయ సాధ్యం కోసం ఎన్ఆర్ఐలు కచ్చితంగా పాల్గొనాలని కోరారు. దీనికయ్యే నిధుల కోసం టీ జాక్ తో పాటు, నాలుగు లక్షల మంది టీఎన్జీవోలను భాగస్వాములను చేసినట్లుగానే విదేశాల్లో ఉన్న వారికి కూడా అవకాశం ఇస్తున్నామని ఆయన ఎన్ఆర్ఐలతో చెప్పారు. నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి దానిని పారదర్శకంగా నిర్వహిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. అలాగే ఇప్పటి వరకు పలు కార్యక్రమాల్లో సాయాన్ని అందించినట్లుగానే ఇకపై కూడా టీడీఎఫ్ సాయం అందించాలన్నారు. తెలంగాణలో వెయ్యేళ్లపాటు చెరువులు ప్రధాన పాత్ర పోషించాయని, అయితే అనంతర పాలకులవల్ల అవి పూర్వవైభవం కోల్పోయాని చెప్పారు. ఏడాదికి 9000 చొప్పున 2019నాటికి మొత్తం 45వేల చెరువులను పునరుద్ధరిస్తామని, ఇందుకోసం 20 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు చెప్పారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్ ఆర్ఐలు కూడా చేయూత నివ్వాలన్నారు. చెరువులు పూర్తయితే 250 టీఎంసీల నీటిని నిల్వచేసుకోవడమే కాకుండాదాదాపు 25 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని అందుకు యుద్ధప్రాతిపదికను ముందుకు వెళతామని హరీష్ రావు పేర్కొన్నారు. -
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో మంత్రి హరీష్ తో ఎన్ఆర్ఐలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) మంగళవారం నిర్వహించనున్న ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాల్గోనున్నారు. ఇందులో భాగంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నతెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్ఆర్ఐలు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు హరీష్ రావుతో ముచ్చటించనున్నారు. ముఖ్యంగా విద్య, జల వనరులు, మౌలిక సదుపాయాలు, విద్యుదుత్పత్తి, సురక్షిత తాగునీరు, ఆరోగ్యం, శాంతి భద్రతలు, మరుగుదొడ్లు తదితర అంశాలకు సంబంధించి ఎన్నారైలు తమ సూచనలను మంత్రికి తెలియజేస్తారు. మంత్రి హరీష్ ఫోన్ ఇన్ ఫోన్ కార్యక్రమం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, సోలార్ విద్యుత్ వంటి కార్యక్రమాల గురించి ప్రవాస భారతీయులకు వివరించనున్నారు. ఎన్ఆర్ఐలతో జరిగే ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ సుమారు రెండు గంటల పాటు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలను హరీష్ రావు ఆ కార్యక్రమం ద్వారా ఎన్ఆర్ఐలకు తెలియజేస్తారు. -
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో డిప్యూటీ సీఎంతో ఎన్ఆర్ఐలు
వాషింగ్టన్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా గురువారం తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) నిర్వహించిన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. తాజాగా డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న ఆయనకు ప్రవాసీలు ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో భాగంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నతెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్ఆర్ఐలు శ్రీహరితో ముచ్చటించారు. ముఖ్యంగా విద్య, జల వనరులు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ ఉత్పత్తి, శుభ్రమైన త్రాగునీరు, ఆరోగ్యం, శాంతి భద్రతలు, మరుగుదొడ్లు తదితర అంశాలకు సంబంధించి సూచనలను వారు శ్రీహరికి తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ, సోలార్ విద్యుత్ వంటి కార్యక్రమాల గురించి శ్రీహరి వారికి తెలియజేశారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో ఎన్ఆర్ఐలతో సమావేశమైనందుకు తనకు ఆనందంగా ఉందని కడియం తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అసలు డైనమిక్ లీడర్ కేసీఆర్ నేతృత్వంలో తాను పని చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని శ్రీహరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దామన్నారు. -
ఫోన్ ఇన్‌కు చక్కటి స్పందన
నిజామాబాద్ వ్యవసాయం : రైతుల సమస్యలపై గురువారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని నిజామాబాద్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పవన్‌చంద్రారెడ్డి తెలిపారు. పలువురు రైతులు ఫోన్ చేసి పం టలను ఆశించిన చీడపీడల గురించి తెలిపారని, వాటి నివారణ చర్యలను తాము సూ చించామని పేర్కొన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో రుద్రూర్‌లోని వరి, చెరుకు పరిశోధ న స్థానం శాస్త్రవేత్తలు కేఆర్.ఠాగూర్, కేఎన్.సంధ్యకిషోర్, జి.ప్రవీణ్, జె.కమలాకర్, రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి.వెంకట్రాజకుమార్ పాల్గొన్నారని తెలి పారు. రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తల సూచనలు.. వరిలో ఆకునల్లి నివారణకు.. వరి గింజలను ఆకునల్లి, కలకెనల్లి పురుగు లు ఆశించినట్లయితే లీటరు నీటికి 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2 మి.లీ. ప్రొఫార్గైట్ కలిపి ఎకరానికి 400 మి.లీటర్ల మందును గింజలపై పిచికారి చేయాలి. వరిలో దోమపోటు నివారణకు.. గోధుమ వర్ణపు/తెల్ల మచ్చదోమలు దుబ్బుల అడుగున నీటి మట్టంపై ఉండి దుబ్బుల నుంచి రసాన్ని పీలుస్తున్నాయి. దీని వల్ల పైరు ఎండిపోతుంది. దోమపోటు నివారణకు పొలాన్ని అప్పుడప్పుడు ఆరబెడుతుండాలి. పొలంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు వదలాలి. సుడి దోమ నివారణకు ఎకరానికి 320 మి.లీ. బుప్రొఫెజిన్ లేదా 400 మి.లీ. ఇతోఫెన్ప్రాక్స్ లేదా 50 గ్రాముల ఇయడాక్లోప్రిడ్ + ఎఫిప్రోల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిచేలా పిచికారి చేయాలి. కాండం తొలిచే పురుగు నివారణకు.. జిల్లాలో వరి పైరు వివిధ దశలలో ఉంది. కాండం తొలిచే పురుగు పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. అదే ఈనిక దశలో ఆశిస్తే తెల్ల కంకులు వస్తాయి. పైరు నాటిన 15-30 రోజులలోపు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు లేదా 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు లేదా 4 కిలోల క్లోరాన్ట్రనిలిప్రోల్ 0.4 జీ గుళికలు వేసుకోవాలి. చిరుపొట్ట దశలో ఎకరానికి 80 మి.లీ. క్లోరాన్ట్రనిలిప్రోల్ 20 ఎస్సీ మందును పిచికారి చేయాలి. సోయాలో పొగాకు లద్దె పురుగు నివారణకు.. ఈ పురుగు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫేట్(ఎకరానికి 200 గ్రాములు) లేదా 1.6. మి.లీ. మోనోక్రొటోఫాస్(ఎకరానికి 320 మి.లీ.) లేదా 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్(ఎకరానికి 500 మి.లీ.) పిచికారి చేయాలి. టమాటలో ఆకు మాడు తెగులు నివారణకు.. ఈ తెగులు నివారణ కోసం లీటరు నీటికి 2 గ్రాముల క్లోరోథలోనిల్(ఎకరానికి 200 గ్రాములు) లేదా 3 గ్రాముల కాప్టాన్(ఎకరానికి 600 గ్రాములు) లేదా 3 గ్రాముల మాంకోజెబ్(ఎకరానికి 600 గ్రాములు) లేదా ఒక మి.లీ. ప్రొపికొనజోల్(ఎకరానికి 200 మి.లీ.) కలిపి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారి చేయాలి. -
తమాషా చేస్తున్నారా..!
► ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ► మూడు రోజుల్లో పరిష్కరించి నివేదికలు ఇవ్వాలి ►ప్రజావాణికి క్లర్కులు.. జూనియర్ అసిస్టెంట్లను పంపడంపై కలెక్టర్ అసహనం మహబూబ్‌నగర్ టౌన్: ప్రజలకు అందించడం ఇష్టం లేదా, లేక మాకెందుకులే అనుకున్నారా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఫిర్యాదులను పరిష్కరించకుండా తమాషాలు చేస్తున్నారా అంటూ జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో ‘ పరిష్కారం’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఫిర్యాదుదారులు తాము తరచూ ఫోన్ చేస్తూనే ఉన్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఫిర్యాదులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న శాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పరిష్కారం’ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించకుండా పెండింగ్ లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న హౌసింగ్, అర్డబ్ల్యూఎస్, మైనార్టీ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ శాఖల అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. దీనికితోడు సమావేశానికి ఆయూ శాఖల అధికారులకు బదులుగా జూనియర్ అసిస్టెంట్లను పంపడంపై కలెక్టర్ మరింత అగ్రహానికి లోనయ్యారు. సంబంధిత అధికారులు వెంటనే రావాలని ఆదేశిస్తూ వారిని హాల్ నుంచి బయటకు పంపించారు. ఇకపై అధికారులకు బదులుగా ప్రతినిధులను పంపితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు రోజుల్లో పరిష్కరించాలి. ఫోన్లో వచ్చే ఫిర్యాదులకు సంబంధించి అన్ని శాఖల అధికారులు మూడు రోజుల్లో పరిష్కరించి బాధితుడికి సమాచారం ఇస్తూ పరిష్కారం ఇన్‌చార్జీకి నివేదిక అందజేయూలనానరు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం ఫిర్యాదులను స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. సిడిపిఓపై అగ్రహం ప్రజావాణి కార్యక్రమానికి ఐసిడిఎస్ పిడి ఇందిర హాజరుకావాల్సి ఉండగా, ఆమెకు బదులుగా సిడిపిఓను పంపించారు. కలెక్టర్‌కు ఎదురుగా కూర్చున్న సీడిపిఓ న్యూస్‌పేపర్ చదువుతుండటాన్ని గమనించిన కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి ఎందుకొచ్చావ్, ఏం చేస్తున్నావ్, న్యూస్‌పేపర్, ఫోన్లో మాట్లాడటం చేసేందుకు వచ్చావా అంటూ నిలదీశారు. వెంటనే బయటకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు.