సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ బలవంతపు పొత్తు కుదిరినా ఎవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రావడం లేదు. తెలంగాణలో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, 47 అసెంబ్లీ స్థానాలకు బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది.
జిల్లాలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు మరో ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా వున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానాల పరిధిలో మూడేసి సీట్ల చొప్పున కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తోంది. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలో నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ స్థానాలపై ఇరు పార్టీలు దాదాపు అంగీకారానికి వచ్చాయి.
అయితే జడ్చర్లలో తమ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉన్నందున మరో సీటు ఇస్తామంటూ టీడీపీ మెలిక పెడుతోంది. గద్వాల అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేందుకు తెలుగుదేశం సుముఖత చూపుతోంది. బీజేపీ మాత్రం మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో మహబూబ్‌నగర్, నారాయణపేట, షాద్‌నగర్, మక్తల్ స్థానాల కోసం పట్టుపడుతోంది. నారాయణపేట స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి తెగేసి చెప్తున్నారు.
మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి ఇప్పటికే నారాయణపేట నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డిని పక్కన పెట్టి మరీ రాజేందర్‌రెడ్డి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఎల్లారెడ్డి పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.
కాగా ఇటీవల మహబూబ్‌నగర్‌లో టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన నిర్వహణ వ్యయాన్ని రాజేందర్‌రెడ్డి భరించినట్లు సమాచారం. దీంతో నారాయణపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ స్థానాల్లో కనీసం రెండు కేటాయిస్తే తప్ప రెండు పార్టీల పొత్తుల కసరత్తు ఫలప్రదమయ్యే సూచన కనిపించడం లేదు.