S.Rajender Reddy
-
నాలుగేళ్ల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొంటా..
నారాయణపేట రూరల్: ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికే ఎమ్మెల్యేగా గెలిచానని.. మరో నాలుగేళ్లలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశాక రాజకీయాల నుంచి తప్పుకుంటానని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట మండలం శ్యాసన్‌పల్లిలో జరిగిన ఎన్ఎస్ఎస్ క్యాంపు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శేఖర్‌రెడ్డి ఉపన్యసిస్తూ నియోజకవర్గాల విభజన జరిగినా మరో ప్రాంతానికి పోకుండా చివరి వరకు నారాయణపేట ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందనగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్పందిస్తూ ఇప్ప టి వరకు బహిర్గతం చేయని ప లు అంశాలను చెబుతానంటూ మాట్లాడారు. 2009 సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మె ల్యే ఎల్కొటి ఎల్లారెడ్డి కోయిలకొండలో ప్రచారం కోసం తనని పిలిపించుకోగా 16 గ్రామాల్లో తాగు, సాగునీరు అజెండాతో ఓట్లు వేయించి 7,800 ఓట్ల మెజార్టీతో గెలిపించానన్నారు. ఆయన హామీ నెరవేర్చకపోవడంతో తన ప్రజల కోసం ఎమ్మెల్యేగా స్వయంగా పోటీచేసి అసెంబ్లీకి వెళ్లానని.. అధికార పార్టీలోకి మారి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నానని తెలిపారు. ఇప్పటికే మిషన్ భగరథ కింద ఇంటింటికి తాగునీరు అందించే దిశగా పనులు వేగవంతం అయ్యాయని, ఇక మరో నాలుగేళ్లలో ప్రతీ ఎకరానికి సాగునీరు కూడా అందాక రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. రోడ్లు లేని నియోజకవర్గాల్లో రెండో స్థానం తెలంగాణ ఏర్పాటు తర్వాత రోడ్లు లేని నియోజకవర్గాలపై సర్వే చేస్తే 37శాతంతో తెలంగాణలోనే రెండో స్థానంలో నారాయణపేట నియోజకవర్గం ఉందని తేలినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతోపట్టుబట్టి పీఆర్, ఆర్ఈండ్బీ, ట్రైబల్ వెల్పేర్ తదితర శాఱల ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకుని వచ్చి వంద శాతం రోడ్లు మంజూరు చేయించి మొదటి స్థానంలో నిలిపానన్నారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథలో 406 వాటర్‌ట్యాంకులు, మిషన్ కాకతీయ కింద 331 చెరువుల మరమ్మత్తులు చేయించానన్నారు. ఎస్ఎల్డీసీ ప్రభుత్వ పరం కోసం 16 ఏళ్లుగా తిరిగినా కాకపోతే తాను పట్టుబట్టి చేయించానన్నారు. ఇక దశాబ్దాలుగా బ్ధాలుగా ఎదురుచూస్తున్న పట్టణ రోడ్డు వెడల్పు నష్టపరిహారం చెలిస్తూ పూర్తిచేస్తున్నామన్నారు. ముప్పై ఏళ్లలో చేయలేని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించానని.. త్రాసుతో కొలిచినా అభివృద్ధి సూచి తనవైపే నిలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. జాయమ్మ పేరుతో మోసం జాయమ్మ చెరువు విషయమై ప్రతీ ఎన్నికల్లో హామి ఇచ్చిన నాయకులు ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి దుయ్యబట్టారు. వాస్తవానికి చెరువును సైతం చూడని నాయకులు 0.6 టీఎంసీల సామర్ధ్యం ఉందని అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. రికార్డుల ప్రకారం కేవలం 0.01 టీఎంసీల సామర్థ్యంతో 90 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉన్న ఈ చెరువు డివిజన్ ప్రజల సాగు, తాగునీటిని తీరుస్తుందని కల్లబొల్లి మాటలతో మోసం చేశారని విమర్శించారు. సంగంబండ నుంచి పేరపళ్ల వరకు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.180కోట్లు ప్రతిపాదనలు ఉన్నాయని, తక్కువ ఆయకట్టుకు అంత ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. పాలమూర్ – రంగారెడ్డి పథకంలో భాగంగా 103 కిలోమీటర్ల కాల్వ నారాయణపేట శివారులోని కొండారెడ్డిపల్లి చెరువుతో ముగుస్తుందని, మార్గమధ్యలో ఉన్న జాయమ్మకు నీరు మళ్లించేలా అనుమతి కోరుతామని తెలిపారు. ఈ విషయమై 17వ తేదీన రానున్న మంత్రి హరీష్‌రావుతో చర్చించి ప్రకటన చేయిస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు. -
అలా కుదిర్చారు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ బలవంతపు పొత్తు కుదిరినా ఎవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రావడం లేదు. తెలంగాణలో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, 47 అసెంబ్లీ స్థానాలకు బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. జిల్లాలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు మరో ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా వున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానాల పరిధిలో మూడేసి సీట్ల చొప్పున కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తోంది. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలో నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ స్థానాలపై ఇరు పార్టీలు దాదాపు అంగీకారానికి వచ్చాయి. అయితే జడ్చర్లలో తమ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉన్నందున మరో సీటు ఇస్తామంటూ టీడీపీ మెలిక పెడుతోంది. గద్వాల అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేందుకు తెలుగుదేశం సుముఖత చూపుతోంది. బీజేపీ మాత్రం మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో మహబూబ్‌నగర్, నారాయణపేట, షాద్‌నగర్, మక్తల్ స్థానాల కోసం పట్టుపడుతోంది. నారాయణపేట స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి తెగేసి చెప్తున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి ఇప్పటికే నారాయణపేట నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డిని పక్కన పెట్టి మరీ రాజేందర్‌రెడ్డి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఎల్లారెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. కాగా ఇటీవల మహబూబ్‌నగర్‌లో టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన నిర్వహణ వ్యయాన్ని రాజేందర్‌రెడ్డి భరించినట్లు సమాచారం. దీంతో నారాయణపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ స్థానాల్లో కనీసం రెండు కేటాయిస్తే తప్ప రెండు పార్టీల పొత్తుల కసరత్తు ఫలప్రదమయ్యే సూచన కనిపించడం లేదు.