
నేను చెప్పేది చెబుతా...నువ్వుండయ్యా..
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ముందు ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాతే మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయాలని ఆయన అన్నారు. ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద విలేకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ...'నేను చెప్పేది చెబుతా..నువ్వుండయ్యా.. ఈరోజు పాత్రికేయ మిత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకముందే ప్రశ్నలు వేయడాన్ని మేం అభ్యంతరం పెట్టాం.
అందుకు ఓ మీడియా ప్రతినిధికి ఆవేదన కలిగించిందని, ఆయనకు ఆవేదన కలిగితే, తాను వేసిన ప్రశ్న సముచితంగా ఉందని ఆయన అనుకుంటే నా వ్యాఖ్యాలు ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏ ఎమ్మెల్యే అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ముందు మేము చెప్పాల్సింది చెప్పిన తర్వాత ప్రశ్నలు అడగండి. మమ్మలను నిలదీయటం సరికాదు. మీతో మాకు వైరుద్యం లేదు, అంతర్యుద్ధం లేదు. ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మీ వృత్తి మీరు చేయండి. మా వృత్తి మమ్మల్ని గౌరవప్రదంగా చేయనివ్వండి' అంటూ క్లాస్ తీసుకున్నారు.