టీచర్ల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా ఎదురుచూస్తున్న హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్), పదోన్నతులు, బదిలీలకు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ ప్రక్రియకు సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఆమోదం తెలి పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ అధికారులతో సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు అంగీకరించారు. ఈ విషయాన్ని కడియం శ్రీహరి విలేకరులకు వెల్లడించారు.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, షెడ్యూల్‌ను 8వ తేదీన (సోమవారం) విడుదల చేయనున్నట్లు తెలిపారు. టీచర్ల బదిలీల విషయంలో విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. టీచర్ల పదోన్నతుల అంశం ఆర్థిక పరిస్థితులతో ముడిపడిన అంశమని సీఎం పేర్కొనగా పెద్ద భారం ఉండబోదని అధికారులు చెప్పడంతో కేసీఆర్ ఓకే చెప్పినట్లు తెలిసింది.
ప్రస్తుతం విద్యార్థులు లేకున్నా టీచర్లున్న స్కూళ్లు 4 వేల వరకు ఉన్నా యి. ఇక విద్యార్థులున్నా టీచర్లు లేని స్కూళ్లు కూడా వేలసంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులున్న చోటుకు టీచర్లను పంపేందుకు చర్యలు చేపట్టనున్నారు.
త్వరలోబదిలీలకు మార్గదర్శకాలు జారీ
రేషనలైజేషన్‌తోపాటు టీచర్ల పద్నోతులు, బది లీలకు కూడా మార్గదర్శకాలు, అవసరమైన ఉత్తర్వులు కూడా సోమవారం జారీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు సీఎం ఆమోదం నేపథ్యంలో ఉత్తర్వులను అధికారులు వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో అర్హులైన టీచర్లకు పదోన్నతులు కల్పించి, బదిలీలు చేపట్టనున్నారు. బదిలీలు చేపట్టాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ బది లీలపై నిషేధాన్ని సడలించాలి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ సోమవారం లేదా మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది.
జీవో నంబర్ 6కు సవరణలు
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం గత సెప్టెంబర్‌లో జారీ చేసిన జీవో నంబర్ 6కు సవరణలు చేయనున్నారు. ఆ జీవో ప్రకారం 19, అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక స్కూళ్లను, 75, అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలను సమీపంలోని స్కూళ్లలో విలీనం చేయాలి.
ఆ నిబంధనను తొలగించకపోతే ఆయా స్కూళ్లు మూతపడటంతోపాటు అందులోని టీచర్ల పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆ నిబంధనకు సవరణలు చేసేందుకు చర్యలు చేపట్టాలని, స్కూళ్లను మూసివేయకుండా అవసరమైన మార్పులు చేయాలని కడియం శ్రీహరి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
2013 నాటి బదిలీలపైనా రానున్న స్పష్టత
టీచర్ల బదిలీల్లో భాగంగా 2013లో బదిలీ అయినా ఇప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగుతున్న ఉపాధ్యాయుల వ్యవహారంపైనా సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారు అప్పట్లో బదిలీ అయిన స్థానాలకు ఇప్పుడు పంపిస్తారా? లేదా వారి నుంచి ఆప్షన్ తీసుకొని వారికి తాజా బదిలీల్లో అవకాశం కల్పిస్తారా? అన్న విషయంలోనూ స్పష్టత రానుంది.