నేడు నేను...రేపు నీవు !
వంతుల వారీగా ఉపాధ్యాయుల విధులు
ఎంఈఓ, సీఆర్ పీ తనిఖీలో వెలుగుచూసిన వైనం
వెంకటాపురం : ఈ రోజు బడికి నేను వెళ్లొస్తా.. రేపు నీవు వెళ్లూ అంటూ ఒకరినొకరు ఉపాధ్యాయులు వంతుళ్ల వారీగా విధులు నిర్వహిస్తూ పాఠశాలకు ఎగనామం పెడుతున్న సంఘటన మండలంలోని రాంనాయక్‌తండా పాఠశాలలో చోటుచేసుకుంది. మండలంలోని రాంనాయక్‌తండా పాఠశాలను గురువారం ఎంఈఓ చాగర్ల అయిలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. హెచ్‌ఎం రవితో పాటు ఉపాధ్యాయుడు ప్రవీణ్ విధులకు హాజరు కావాల్సి ఉండగా హెచ్‌ఎంకు ఎలాంటి సెలవుపత్రం లేకుండానే విధులకు గైర్హాజరవుతూ విధులకు ఆలస్యంగా హాజరయ్యాడు. దీంతో ఎంఈఓ ప్రవీణ్‌ను మందలించి సమయపాలన పాటించాలని లేనట్లయితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. శుక్రవారం అదే పాఠశాలకు సీఆర్‌పీ రమేష్‌ను ఎంఈఓ పంపించగా ఉపాధ్యాయుడు ప్రవీణ్ ఎలాంటి సెలవుపత్రం లేకుండానే విధులకు డుమ్మా కొట్టగా హెచ్‌ఎం రవి ఉదయం 10:30 గంటలకు విధులకు హాజరయ్యాడు. దీంతో సీఆర్‌పీ ఎంఈఓ అయిలయ్యకు ఉపాధ్యాయుల తీరుపై సమాచారం అందించారు. ఇది ఒక్క రాంనాయక్‌తండాలోనే కాదు మండలంలోని సుమారు 12 పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారని స్వయంగా ఆయా కాంప్లెక్స్‌లకు చెందిన సీఆర్‌పీలే ఆరోపిస్తున్నారు.
సుబ్బక్కపల్లి పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఇప్పటివరకు గ్రామంలో బడిబాట కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఇద్దరిలో ఒక ఉపాధ్యాయుడు ఇప్పటివరకు పాఠశాలకు హాజరుకాలేదని గ్రామస్తులు స్వయంగా ఎంఈఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం మూలంగా గత ఏడాది 22 మంది విద్యార్థులకు ప్రస్తుతం ఐదుగురు మాత్రమే హాజరవుతున్నారని వారు పేర్కొంటున్నారు. పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకుల అండతోనే ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరవుతున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది.
ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తా
పాఠశాల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ వం తుల వారీగా విధులు నిర్వహిస్తున్న రాంనాయక్‌తండాకు చెందిన ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తా. గురువారం పాఠశాలను సందర్శించగా హెచ్‌ఎం రవి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విధులకు గైర్హాజరయ్యాడు. శుక్రవారం సీఆర్‌పీ రమేష్ పాఠశాలను సందర్శించగా ప్రవీణ్ రాలేదు. ఉపాధ్యాయులు సమయపాలన కూడా పాటించడం లేదు. ఇద్దరు ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులకు నివేదిస్తా. - చాగర్ల అయిలయ్య, ఎంఈఓ