
టెక్నాలజీతోనే అభివృద్ధి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో మూడింట రెండొంతుల అభివృద్ధి టెక్నాలజీ వినియోగంతోనే సాధ్యమైందని...
* రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సూచన
* సైబర్ భద్రత కోసం సీఆర్ రావు సంస్థతో సర్కారు ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో మూడింట రెండొంతుల అభివృద్ధి టెక్నాలజీ వినియోగంతోనే సాధ్యమైందని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్, సీఆర్‌రావు అడ్వాన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (ఏఐఎంఎస్‌సీఎస్) చైర్మన్ సి.రంగరాజన్ అన్నారు. డిజిటల్ తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌రావు ఏఐఎంఎస్‌సీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకుంది.
మాదాపూర్‌లోని టెక్ మహేంద్ర ఆడిటోరియంలో సోమవారం ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఆర్ రావు సంస్థ డెరైక్టర్ డాక్టర్ అల్లం అప్పారావులు ఎంవోయూపై సంతకాలు చేశారు. రంగరాజన్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే టెక్నాలజీని వినియోగించుకోవాల్సిందేనన్నారు. డిజిటల్ అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు మధ్య అంతరాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఐటీ విప్లవంతో ఒకవైపు టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుంటే మరోవైపు టెక్నాలజీని దుర్వినియోగం చేసేవాళ్లు పెరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని నివారించేందుకు పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీకి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమన్నారు.
త్వరలో సైబర్ సెక్యూరిటీ అకాడమీ
భవిష్యత్తులో రక్తపు బొట్టు పడకుండానే యుద్ధాలు జరగబోతున్నాయని డిజిటల్ ఇండియా వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారని, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఆర్‌రావు సంస్థతో కలసి త్వరలోనే సైబర్ భద్రత శిక్షణ అకాడమీని ప్రైవేట్/పబ్లిక్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామన్నారు.
అనంతరం.. యూబర్ టెక్నాలజీ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రాబోయే ఐదేళ్లలో ఈ సంస్థ హైదరాబాద్‌లో రూ.350 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని కేటీఆర్ తెలిపారు. అలాగే.. ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాలను అందించే టాస్క్ సంస్థ, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ సంస్థ శ్యాంసంగ్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. సైబర్ జోన్‌లో ఈ-వేస్ట్ నిర ్వహణపై టీఎస్‌ఐఐసీ, నాస్కామ్ నిర్వహించిన సర్వేలో ఉత్తమ పనితీరు కనబర్చిన కంపెనీలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో యూబర్ సంస్థ సీఈవో శ్రీకాంత్ సిన్హా, శ్యాంసంగ్ జీఎం సిద్దార్థ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.