ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ.. గురువారం అంతా ఆధారాల పరిశీలన, డాక్యుమెంట్ల తయారీలో మునిగిపోయింది. ముందు ముందు ఎలా సాగాలన్న దానిపై కూడా తీవ్రస్థాయిలో ఏసీబీ అధికారులు చర్చించారు. న్యాయపరమైన అంశాలు, నిందితులకు జారీ చేయాల్సిన నోటీసుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం రికార్డ్ చేసిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం శుక్రవారం సాయంత్రంలోగా ఏసిబీకి అందే అవకాశాలున్నాయి. ఒక్కసారి అది అందిన వెంటనే ఏసీబీ విచారణ మరింత వేగం పుంజుకోనుంది.
ఇప్పటివరకు ఏసీబీ సేకరించిన ఆడియో, వీడియో ఫుటేజీలు ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఉన్నాయి. వాటి నివేదికలు కూడా ఇంకా అందాల్సి ఉంది. మొత్తమ్మీద గురువారం మొత్తం ఏసీబీ ఉన్నతాధికారులు ఎవరూ పెద్దగా బయటకు వెళ్లిన దాఖలాలు లేవు. డాక్యుమెంటేషన్ ప్రక్రియమీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. మరో రెండు రోజులు కూడా ఇలాగే ఉండొచ్చని సమాచారం. అయితే.. నిందితులు ఎవరూ తప్పించుకోకుండా ఏసీబీ చాకచక్యంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా ఏసీబీ వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉంది. అలాగే ఇప్పటికే ఒకసారి విచారించిన వేం నరేందర్ రెడ్డిని మళ్లీ సోమవారం పిలుస్తారని సమాచారం. ఇవన్నీ జరిగిన తర్వాత చకచకా పావులు కదిపి మరింతమందికి నోటీసులు ఇవ్వడం, అవసరమైతే అరెస్టులు చేయడం లాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏసీబీ.. ఏం చేస్తోంది?
Published Thu, Jun 18 2015 7:14 PM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement
Advertisement