కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిథ్యం ఉండేలా చూడాలంటూ బీజేపీ తెలంగాణ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిథ్యం ఉండేలా చూడాలంటూ బీజేపీ తెలంగాణ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినందున తొందరగా అభివృద్ధి చెందాలంటే స్థానిక నేతలు కేంద్రమంత్రివర్గంలో ఉండటం అవసరమని వారు పేర్కొన్నారు. ప్రధానిగా కొలువుదీరిన తర్వాత పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఆయనను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ నుంచి పార్టీ తరపున విజయం సాధించిన ఏకైక ఎంపీ బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రివర్గ కూర్పులో ఆయనకు తప్పకుండా అవకాశం ఉంటుందని తామంతా భావించామని, కానీ ఆయనకు అవకాశం రాకపోవటంతో నిరుత్సాహపడ్డామని పేర్కొన్నారు.
ఈ విన్నపాన్ని సానుకూలంగా విన్న నరేంద్రమోడీ త్వరలో జరిగే విస్తరణలో పరిశీలిస్తానని సానుకూలంగా స్పందించినట్టు కిషన్‌రెడ్డి విలేఖరులకు తెలిపారు. బండారు దత్తాత్రేయకు మంత్రివర్గంలో చోటు లభించకపోవటానికి... మోడీకి తెలంగాణ అంటే చిన్నచూపు ఉండటమే కారణమనే భావన సరికాదని ఆయన అన్నారు.