మంచిర్యాల : పేదల సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే... సద్వినియోగం చేసుకోకుండా ఆ నిధులకు తెలంగాణ ప్రభుత్వం గండి కొడుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదరికం నుంచి వచ్చిన దేశ ప్రధాని పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని విమర్శించారు.
ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే సంకల్పంతో కేంద్రం రాష్ట్రంలోని 90 వేల మందికి ఇళ్లను మంజూరు చేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కూలీలకు రూ.194 రోజు కూలీగా చెల్లించాలని నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను కూడా కూలీలకు దక్కకుండా దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం రూ.43 వేల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మజ్లిస్ పార్టీని దగ్గర పెట్టుకొని చేస్తున్న పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు