సాక్షి, హైదరాబాద్: పోస్టల్ ఓట్లు, ఈవీఎం యంత్రాల్లోని ఓట్లను లెక్కించాకే వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ వెల్లడించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి సంబంధిత పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో పార్టీలకు పడిన ఓట్ల సంఖ్యతో సరిపోలుస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులకు గురువారం హైదరాబాద్‌లో శిక్షణ నిర్వహించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 23 ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏయే స్థాయిలో ఏ ఓట్లు లెక్కించాలి.
లెక్కించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు.. ఎన్నికల ఏజెంట్లతో వ్యవహరించాల్సిన తీరు.. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌లోని ఓట్లను లెక్కించాల్సిన పద్ధతి.. పరిశీలకుల సంతకాలకు ఉన్న ప్రాముఖ్యం తదితర అంశాల్లో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలను శిక్షణలో భాగంగా వివరించినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీపడిన నిజామాబాద్ నియోజకవర్గ ఓట్లను లెక్కించేందుకు 18 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అత్యధిక ఓటర్లున్న మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి సంబంధించి 24 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కన్సల్టెంట్ భన్వర్‌లాల్, డిప్యూటీ ప్రధాన ఎన్నికల అధికారి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, జాయింట్ సీఈవో ఆమ్రపాలి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment