వారిపై వేటు వేయాల్సిందే
* నేతి విద్యాసాగర్ సహా 8 మంది ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేయనున్న డీఎస్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో విప్‌ను ధిక్కరించిన పార్టీ ఎమ్మెల్సీలపై సాధ్యమైనంత తొందరగా అనర్హత వేటు వేయించే దిశగా కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. వారిలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలపై అనర్హత పిటిషన్ దాఖలు చేయగా... తాజాగా తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావుతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, డి.రాజేశ్వర్‌లపైనా అనర్హత పిటిషన్ దాఖలు చేసేందుకు మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ సిద్ధమయ్యారు. కాగా, మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికైన అనంతరం డీఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. పెద్దల సభగా పరిగణించే మండలిని గ్రామ సర్పంచ్ స్థాయికన్నా దిగువకు టీఆర్‌ఎస్ దిగజార్చిందని మండిపడ్డారు.
కలిసి పనిచేస్తామని.. కలిపేసుకోవడమా?: షబ్బీర్ అలీ
తెలంగాణ పునర్నిర్మాణంలో అందరితో కలిసి పనిచేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అన్ని పార్టీలను టీఆర్‌ఎస్‌లో కలుపుకొంటున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. కలిసి పనిచేయడమంటే ఇదేనా ? అని మండిపడ్డారు.
చట్టాన్ని ఉల్లంఘించారు: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలు చట్టాన్ని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంబంధించి బుధవారం ఢిల్లీలో ఆంటోనీ కమిటీకి నివేదిక ఇచ్చిన దిగ్విజయ్.. అనంతరం మీడియాతో మాట్లాడా రు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై టీఆర్‌ఎస్‌లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటింపజేసే దిశగా ప్రక్రియను చేపడతాం..’’ అని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విరుద్ధం: టీడీపీ
మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన తీరు ప్రజాస్వామ్య విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్సీ ఎ.నర్సారెడ్డి విమర్శించారు.