సీఎం ఓకే అంటేనే..
డిమాండ్లపై ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించ లేదు.సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి సమస్యలపై చర్చించిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు.. మంగళ వారం మరోసారి ఆయనతో సమావేశమ య్యారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత త్వర గా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎస్ హామీ ఇచ్చారు. కీలకమైన సాధారణ బదిలీల విషయంలో సాంకేతిక సమస్యలతో పాటు ఖాళీల సమస్య ఉందన్నారు.
బదిలీల కు అవకాశం కల్పిస్తే కొత్తగా ఏర్పడిన మారు మూల జిల్లా కలెక్టరేట్లలో పనిచేస్తున్న అరకొర సిబ్బంది కూడా పట్టణాలకు సమీపంలోని జిల్లాలను కోరుకుంటారని, అప్పుడు మారు మూల జిల్లాల్లో పాలన దెబ్బతింటుందనే అభిప్రాయపడ్డారు. ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల బదిలీలను కొత్త జిల్లాల ప్రకా రమా.. లేక పాత జిల్లాల ప్రకారమా అన్నది ముందుగా నిర్ణయించాల్సి ఉందని సీఎస్ పేర్కొన్నట్లు సమాచారం. పాత జిల్లాల ప్రకారమైతే కొత్త జిల్లాల్లో.. మారుమూల ప్రాంతాల్లో ఉండకుండా, పట్టణ ప్రాంతాలకు వచ్చేందుకు ఎక్కువ మంది ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉందని, దీంతో క్షేత్రస్థాయిలో పాలనపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త జిల్లాల ప్రకారమైతే... ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న వారికి శాశ్వత కేటాయింపులు జరిపి, ఆ తర్వాత బదిలీలు చేయాల్సి ఉం టుంది. దీంతో ఇçప్పటికిప్పుడు సా«ధారణ బదిలీలు కష్టమేనని సీఎస్ అన్నట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షు రాలు వి.మమత, టీఎన్‌జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.
సమస్యలపై ఏకరువు...
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై రాష్ట్రంలో నిషేధం అమల్లో ఉంది. రాష్ట్రం ఏర్ప డక ముందు రెండేళ్లు.. తర్వాత మూడేళ్లుగా బదిలీలు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ సంఘా ల ప్రతినిధులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆరేడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.
భార్యాభర్త ల కేసులను ప్రత్యేకంగా పరిగణిస్తామని, వారి బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినా... ఖాళీలు లేని కారణంగా అది అమలుకు నోచుకోవటం లేదన్నారు. పునర్విభజన అనంతరం ఏపీలో ఇప్పటికే రెండుసార్లు బదిలీలు జరిగాయన్నారు. విద్యా సంవత్సరం ఆరంభం దృష్ట్యా పిల్లల చదువు లను దృష్టిలో ఉంచుకొని మే 15 లోపు బదిలీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంచిన పీఆర్‌సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం వద్దే ఉందని, పీఆర్‌సీ బకాయిలను ఎన్ని విడతలుగా చెల్లించాలనేది తుది పరిశీలనలో ఉందని సీఎస్ తెలిపారు.
సీపీఎస్ రద్దు చేయండి...
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. ఈ విధానంతో ఉద్యోగు లకు అన్యాయం జరుగుతుందని, దీన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలయ్యేలా చూ డాలని కోరారు. అయితే ఇది క్లిష్టమైందని, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని సీఎస్ చెప్పారు. సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగుల కు గ్రాట్యుటీ చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని.. తెలంగాణలోనూ చెల్లిం చాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.
ఏపీలో ఉన్న తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులతో పాటు మిగతా ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసు కోవాలని, ఆ మేరకు ఏపీతో సంప్రదిం పులు జరపాలని విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే ఈ అంశంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని, ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని సీఎస్ బదులిచ్చారు. ఫైలు సీఎం పరిశీలనలో ఉందని, అన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని హామీనిచ్చారు.
వారం తర్వాత కార్యాచరణ: ఉద్యోగ సంఘాలు
సీఎస్‌తో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారంలోపు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారని, ఆలోగా సమస్యలు పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. సీఎస్‌ను కలిసిన వారిలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి రాజేందర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివశంకర్ తదితరులు ఉన్నారు.