‘రాయితీ’ సొమ్ముతో గట్టెక్కిన ఆర్టీసీ
జూన్ నెల జీతాలకు డబ్బులు కరువు
* బస్‌పాస్ రీయింబర్స్‌మెంట్‌తో ఊపిరి పీల్చుకున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త జీతాల చెల్లింపు ఇప్పుడు ఆర్టీసీ పీకల మీదకొచ్చింది. భారీ ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీపై భారం పడకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఫిట్‌మెంట్ ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
అయితే, జూన్ నెల ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో ఈ నెల జీతాల చెల్లింపుపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది. నాలుగు రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనే కారణంతో ఆర్థిక శాఖ ఎటూ తేల్చలేదు. దీంతో జీతాలు చెల్లించడమెలాగో అంతుచిక్కక ఆర్టీసీ అధికారులు తీవ్ర ఆందోళనలో ఉండిపోయారు.
ఆదుకున్న జీవో: ఆర్టీసీ ప్రతినెలా దాదాపు రూ.140 కోట్ల మేర జీతాల రూపంలో చెల్లిస్తుంది. 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటనతో అదనంగా రూ.65 కోట్ల వరకు భారం పడింది. వెరసి జూన్ నెలాఖరున రూ.200 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. కానీ, సచివాలయం నుంచి సానుకూల కబురు రాకపోవడంతో జీతాల చెల్లింపులో జాప్యం తప్పదనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. ఇంతలో ప్రభుత్వం నుంచి అనుకోని తీపి కబురు అందింది. బస్‌పాస్‌ల రూపంలో ఆర్టీసీ కోల్పోతున్న మొత్తాన్ని రీయింబర్స్ చేసే క్రమంలో గురువారం రూ.75 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో ఆ మొత్తాన్ని జీతాలకు మళ్లించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించి ఊపరి పీల్చుకున్నారు.