13,445 కోట్లు | telangana government allots 13,445 crs for devadula | Sakshi
Sakshi News home page

13,445 కోట్లు

Published Fri, Feb 3 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

13,445 కోట్లు

13,445 కోట్లు

భారీ ఎత్తిపోతల పథకంగా దేవాదుల
- ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచేందుకు, డిజైన్ల మార్పునకు కేబినెట్‌ ఆమోదం
- కంతనపల్లికి బదులుగా    తుపాకులగూడెం వద్ద బ్యారేజీ
- కొత్తగా మల్కాపూర్‌ రిజర్వాయర్‌
- ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టులు రద్దు
- తక్షణం సాగునీరందించే ప్రాజెక్టులపై అధ్యయనం
- జైళ్ల సంస్కరణలపై సబ్‌ కమిటీ
- కొత్త జిల్లాల్లో ఏడాదిలోగా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలు
- కరీంనగర్‌లో ఫిషరీస్‌ కాలేజీ ఏర్పాటు
- పలు శాఖల్లో కొత్త పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌


సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదిపై నిర్మిస్తున్న దేవాదుల ప్రాజెక్టును భారీ ఎత్తిపోతల పథకంగా మార్చాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. మూడు దశల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.9,427 కోట్ల నుంచి రూ.13,445 కోట్లకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై చేపట్టదలచిన కంతనపల్లి బ్యారేజీకి బదులుగా తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. ఆయకట్టు స్థిరీకరణతో పాటు బహుళ ప్రయోజనాలు ఉండేలా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మల్కాపూర్‌ దగ్గర 10 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్‌ నిర్మించాలని తీర్మానించింది.

ఖమ్మం జిల్లాల్లో అసంపూర్ణంగా ఉన్న రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్సారెస్పీ రెండో దశ పనులకు రూ.1,303 కోట్ల అంచనాతో సవరణ ప్రతిపాదనలను ఆమోదించింది. గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం భేటీ అయింది. సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు, అంచనాల సవరణలకు సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖల పరిధిలో పలు పోస్టుల భర్తీ, ఇతర అంశాలకు ఆమోదం తెలిపారు.

జైళ్ల సంస్కరణలపై సబ్‌ కమిటీ
జైళ్లలో తీసుకురావాల్సిన సంస్కరణలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన మంత్రులు కేటీఆర్, ఈటల, ఇంద్రకరణ్‌రెడ్డిలతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. యాసిడ్‌ దాడులకు పాల్పడిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు. ఈ నేరస్తులకు పదేళ్ల నుంచి జీవిత కాల శిక్ష విధించడంతో పాటు నేరస్తులకు జరిమానా విధించి ఆ డబ్బును బాధితులకు అందజేసేలా చర్యలు తీసుకోనున్నారు.

ఎత్తిపోతలపై హరీశ్‌ నేతృత్వంలో బృందం
రాష్ట్రంలో తక్షణం సాగునీటిని అందించే అవకాశమున్న ఎత్తిపోతల పథకాలపై మంత్రి వర్గంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా భక్త రామదాసు ప్రాజెక్టు తరహాలో త్వరగా నీటిని అందించగల ప్రాజెక్టులను గుర్తించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావులకు అధ్యయన బాధ్యతలను అప్పగించింది.

ఏడాదిలోగా కొత్త కలెక్టరేట్లు
అన్ని కొత్త జిల్లాల్లో ప్రభుత్వ, పోలీసు కార్యాలయాలను ఏడాదిలోగా నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాలు, పోలీసు ఆఫీసు కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు, ప్రతిపాదనల తయారీ వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగులను పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న శాఖల్లోకి మార్చాలని ఆదేశించారు.

వివిధ శాఖల్లో కొత్త పోస్టులు
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 480 కొత్త పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రితో పాటు మెడికల్‌ కాలేజీకి 519 పోస్టులు మంజూరు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు ఒక్కోదానికి 9 పోస్టుల చొప్పున మంజూరు చేసింది. పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో 10 రెగ్యులర్‌ పోస్టులు, 7 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు.. అప్‌గ్రేడెడ్‌ బీసీ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో 240 బోధన, బోధనేతర పోస్టుల ర్యాటిఫికేషన్‌.. జైళ్ల శాఖలో ఐజీ, అసిస్టెంట్‌ డైరెక్టర్, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టుల మంజూరు.. వరంగల్‌ జిల్లా మామునూరు వెటర్నరీ కాలేజీలో బోధన, బోధనేతర పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరుగురు మంత్రుల పేషీల్లో తాత్కాలిక పోస్టులకు కూడా ఓకే తెలిపింది.

కరీంనగర్‌లో ఫిషరీస్‌ కాలేజీ
కరీంనగర్‌లోని లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) వద్ద ఫిషరీస్‌ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

స్కూల్‌ అసిస్టెంట్లుగా భాషా పండితులు, పీఈటీలు
విద్యా శాఖలో 2,487 మంది భాషా పండితులు, 1,047 పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనిపై వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement