ప్రైవేట్‌లోనూ కరోనా | Telangana Government Allows Private Hospitals To Treat Corona Patients | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌లోనూ కరోనా

Published Mon, May 18 2020 3:53 AM | Last Updated on Mon, May 18 2020 3:53 AM

Telangana Government Allows Private Hospitals To Treat Corona Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స చేసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీయూ లేదా వెంటిలేటర్‌ సౌకర్యంతోపాటు కరోనా చికిత్స అందించగలిగే స్థాయి కలిగిన ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. మిగిలిన క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్‌ హోంలకు మాత్రం అటువంటి వెసులుబాటు కల్పించలేదు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు విడుదల చేశారు.

కరోనా రోగులకు ఇప్పటివరకు కేవలం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేసేందుకు అనుమతి ఉంది. అయితే కొన్ని ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇప్పటికే కరోనా చికిత్సలు చేస్తున్నాయి. కానీ అధికారికంగా సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో ఎవరైనా వెళ్లి వాటిల్లో చికిత్స చేయించుకోవచ్చు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఆస్పత్రులను మూడు రకాలుగా వర్గీకరించారు. ఒకటి ప్రైవేటు క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు. రెండోది ఇన్‌–పేషెంట్‌ సౌకర్యంలేని నర్సింగ్‌ హోంలు.

మూడోది ఐసీయూ లేదా వెంటిలేటర్ల సౌకర్యం ఉండి కరోనా చికిత్స అందించే సామర్థ్యం కలిగిన ఆస్పత్రులు. ఈ విభజన ప్రకారం ఆయా ఆస్పత్రులు ఏ విధమైన మార్గదర్శకాలు పాటించాలో ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా అనేక ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు వైద్య సేవలు నిలిపేశాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నాయి. దీంతో సాధారణ వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు తిరిగి తమ సేవలందించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

కరోనా చికిత్స చేసే ప్రైవేటు ఆస్పత్రులకు మార్గదర్శకాలు...
కరోనా అనుమానిత రోగులు వస్తే వారి పరీక్షా ఫలితాలు 
వచ్చే వరకు ఐసోలేషన్‌ రూంలో ఉంచాలి. 
ల్యాబ్‌ టెక్నీషియన్లు శ్వాబ్‌ నమూనాలు తీసేటప్పుడు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
కరోనా రోగుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసి, ఆస్పత్రిలో కరోనా జోన్లను ఏర్పాటు చేయాలి. 
కరోనా జోన్‌లో వైరస్‌ లక్షణాలున్న వారి కోసం ఐసీయూ, వెంటిలేటర్ల సౌకర్యాలను సిద్ధం చేయాలి.
కరోనా జోన్‌లో తప్పకుండా ఆపరేషన్, పోస్ట్‌ ఆపరేషన్‌ వార్డు, లేబర్‌ రూం ఉండాలి. ఈ జోన్‌లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలి.
ప్రతి కరోనా పాజిటివ్‌ కేసును అవసరాన్నిబట్టి కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, అనెస్తీషియనిస్టు, ఇతర సంబంధిత వైద్యులు పరీక్షించాలి. 
పాజిటివ్‌ రోగుల చికిత్సా విధానాలకు సంబంధించి ఐసీఎంఆర్, కేంద్ర మార్గదర్శకాలను విధిగా పాటించాలి.
ఒకవేళ కరోనా రోగి మరణిస్తే మృతదేహాన్ని ఐసీఎంఆర్‌ ప్రొటోకాల్‌ ప్రకారం తరలించి దహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. 
ప్రతి ఆస్పత్రి విధిగా మరణాల వివరాల రిజిస్టర్‌ను నమోదు చేయాలి. అందులో కరోనా లేదా కరోనాయేతర రోగులు ఎలా చనిపోయారో వివరాలు ఉండాలి. ఆ వివరాలను జిల్లా వైద్యాధికారులకు పంపించాలి.
టీకాల షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగించాలి. 
ఆస్పత్రి ప్రాంగణంలో లెక్కకు మించిన రోగులు, వారి సహాయకులు ఉండకుండా చూసుకోవాలి. రొటీన్‌ విజిటింగ్‌కు అనుమతించొద్దు. 
రొటీన్‌ ఫాలో అప్‌ కేసుల విషయంలో టెలి మెడిసిన్‌ విధానాన్ని అవలంబించాలి.
వైద్య సిబ్బందికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు ఇవ్వాలి.
అన్ని ఆస్పత్రులు విధిగా ఫ్లూ, జ్వరం, తీవ్ర శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడే రోగులు, గర్భిణుల వివరాలను రిజిస్టర్‌లో నిత్యం నమోదు చేయాలి. వాటిని ఈ–బర్త్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
అన్ని ఆస్పత్రులు విధిగా కరోనా పాజిటివ్‌ రోగుల వివరాలను నమోదు చేస్తూ వాటిని సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. 
ఇన్‌–పేషెంట్‌ రోగులు, శస్త్రచికిత్సల వివరాలు కూడా నమోదు చేయాలి. వాటిని జిల్లా వైద్య, అధికార యంత్రాగానికి పంపాలి. 
కరోనా జోన్‌లో మాస్క్‌లు, గ్లౌజ్స్, ఫేస్‌ షీల్డ్, హ్యాండ్‌ వాషింగ్, శానిటైజర్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలి. భౌతికదూరం పాటించాలి. ూ వైరస్‌ సోకిన రోగులు, ఇతర రోగులు కలవకుండా చర్యలు చేపట్టాలి. ఈ మార్గదర్శకాలను పాటించని ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.
క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్‌హోంలకు...
రోగుల రద్దీని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
అందుకోసం డాక్టర్లు గంటకు నలుగురైదుగురు రోగులను మాత్రమే చూడాలి. ూ ప్రతి రోగి పక్కన ఒక్కరినే అనుమతించాలి. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి.
ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలి. క్లినిక్‌లోకి 
ప్రవేశించే ముందు సబ్బునీటితో లేదా ఆల్కహాల్‌ ఆధారిత 
శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి. ూ జ్వరం, జలుబు, దగ్గు వంటి అనుమానిత కేసులను కరోనా ఆస్పత్రికి తరలించాలి. అటువంటి వారి కోసం ప్రత్యేక కౌంటర్, రోగులకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేయాలి. ూ ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు, ఎన్‌–95 మాస్క్‌లు ధరించాలి. ూ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు మూడు పొరల మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్, గ్లౌజ్స్‌ మొదలైనవి ధరించాలి. ూ ప్రతి రోగిని పరీక్షించాక వైద్యులు తప్పనిసరిగా సబ్బునీరు లేదా ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ రబ్‌తో చేతులు కడుక్కోవాలి. ూ బయో మెడికల్‌ వ్యర్థాల తొలగింపు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి.
చేతులు కడుక్కొనే అవకాశం, శానిటైజర్‌ సౌకర్యం ఆస్పత్రి ప్రతి మూలలో అందుబాటులో ఉంచాలి. 
క్లినిక్‌ను ప్రతిరోజూ బ్లీచ్‌ లేదా ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్‌తో క్రిమిసంహారకం చేయాలి.ూ సాధ్యమైతే టెలి మెడిసిన్‌ సౌకర్యాన్ని వైద్యులు ఉపయోగించుకోవాలి.
కరోనా అనుమానిత కేసులను పరీక్షల కోసం, ఇతరత్రా 
నిర్వహణ కోసం కరోనా ఆస్పత్రికి తరలించాలి.
కరోనాకు చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రులకు కూడా 
ఈ నిబంధనలు వర్తిస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement